21 August, 2026 | 10:26 AM

ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఆకాంక్షిస్తున్నా

23-05-2024 04:02 AM

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వసతిగృహం, కల్యాణ మండపం ఏర్పాటు

తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న సీఎం రేవంత్

మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లింపు  

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే నూతన  ప్రభు త్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని, సమస్యల పరిష్కారానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. తిరుమలలో  తెలంగాణ ప్రభుత్వం తరఫున వసతి గృహం, కల్యాణ మండపం  ఏర్పాటు కు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాల ని భగవంతుని ప్రార్థించినట్లు, స్వామి ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

కుటుంబ  సభ్యులతో కలిసి రేవంత్‌రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు.  టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడు రేయాన్స్ పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్‌రెడ్డికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.