భూకబ్జా యత్నాలను అడ్డుకుని బాధిత రైతుకు రక్షణ కల్పించాలి
భూక్యా సీతారాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 11 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టు మల్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి పంటను ధ్వంసం చేయడం, బలవంతంగా పామాయిల్ మొక్కలు నాటడం, భూమిని ఆక్రమించుకునేం దుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం బాధిత రైతు భట్టు హరి తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. వివరాల్లోకి వెళితే గట్టుమల్ల గ్రామ పరిధిలోని సర్వే నం. 120లో 9.01 ఎకరాలు, సర్వే నం. 119/A/1లో 1.01 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి భట్టు శ్రీనివాస్ పేర పట్టా పాస్బుక్లు, భూ రికార్డులు ఉన్నాయి. భట్టు శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నందున, తన మేనల్లుడు భట్టు హరికి 2025 జూన్ 25వ తేదీన స్పెషల్ పవర్ ఆఫ్ అటానీ (SPA) ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో భూమిలో బోరు వేస్తున్న సమయంలో అడ్డుకోవడం, బోరులో రాళ్లు వేయడం, కేసింగ్ పైపులను ధ్వంసం చేయడం, ఫెన్సింగ్ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ మాట్లాడుతూ, భట్టు శ్రీనివాస్ భూములను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, భట్టు నరేష్ నాయక్, భట్టు వీరన్న నాయక్, భట్టు హరి నాయక్, బానోత్ సందీప్ నాయక్, బానోత్ సతీష్ నాయక్, భట్టు తేజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






