66.6% ఓటింగ్
భువనగిరిలో అత్యధికంగా 76.78 శాతం
అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం
గత లోక్‌సభ ఎన్నికలకంటే మూడు శాతం ఎక్కువ
అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్
ఓటేసినవారు 2,20,24,806 మంది
10 సెగ్మెంట్లలో 70 శాతానికి పైగా ఓటింగ్
ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడి
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిం దని, ఎలాంటి రీ పోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 66.6 శాతం పోలింగ్ నమోదయిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 3,32,16,348 ఓటర్లకుగాను 2,20,24,806 మంది ఓటర్లు ఓటు వేశారని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 2,18,14,035 మంది నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయగా, మిగతా 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్, వృద్దులు తమ ఇంటి నుంచే ఓటు వేశారని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు 65.67 శాతమని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకంటే ఈసారి ఓటింగ్ 3 శాతం పెరిగిందని తెలిపారు.
అత్యధికం భువనగిరిలో
ఈసారి భువనగిరి లోక్‌సభ పరిధిలో అత్యధికంగా 76.78 శాతం ఓటింగ్ నమోదయ్యిందని వికాస్‌రాజ్ తెలిపారు. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదైనట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాలుగా చూస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్‌లో 84.25 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మలక్‌పేటలో 42.76 శాతం పోలింగ్ నమోదయిందని వివరించారు. ఓట్ల పరంగా చూస్తే మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,85,149 ఓట్లు పోల్ కాగా, అత్యల్పంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1,05,383 ఓట్లు పోలైనట్లు చెప్పారు.
10 నియోజకవర్గాల్లో 70 శాతం ఓటింగ్ దాటిందని తెలిపారు. ఈవీఎంలను ఎన్నికల ఎజెంట్లతోపాటు పోటీచేసిన అభ్యర్థుల సమక్షంలోనే సీజ్ చేశామని, స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపర్చామని సీఈవో తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీటీవీలతో పాటు సాయుధ బలగాల పర్యవేక్షణ ఉందని చెప్పారు. జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని, ఈవీఎంలను అభ్యర్థులు, ఎజెంట్ల సమక్షంలోనే తెరుస్తామని తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.





