4 April, 2026 | 4:11 AM

మార్పు రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి!

04-04-2026 02:38 AM
  1. రెండేండ్లలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత 
  2. కాళేశ్వరం బరాజ్‌లను పునరుద్ధరించాలి.. 
  3. లేకుంటే తెలంగాణ సమాజం క్షమించదు 
  4. ఏ పార్టీలో చేరాలనేది అభిమానులే నిర్ణయిస్తారు
  5. మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి

* ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకునే విధానంపై ప్రభుత్వం ఆలోచించడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేసి, ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రయత్నం చేస్తే, అంత ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మూసీ ప్రక్షాళన కూడా ప్రాణహితపై ఆధారపడి ఉన్నది.         

మాజీమంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాల, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): గతం లో మార్పు రావాలి.. కేసీఆర్ పోవాలి.. అం టూ ముందుకు సాగితే పదేళ్ల తర్వాత మార్పు వచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి రెండేండ్లలోనే మార్పు రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి అనే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి ఘాటు వ్యాక్యలుచేశారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకపోవడం, ప్రాజెక్టును పునరుద్ధరించపోవడం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

శుక్రవారం జగిత్యాలలోని తన నివా సంలో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అనడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లు ఒక భాగం మాత్రమేనని, మూడు బరాజ్‌లను పునరుద్ధరించాలంటే రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.

ప్రాణహిత నదీ జలాలను వినియోగించునే విధానంపై ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేసి, ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రయ త్నం చేస్తే, అంత ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని గుర్తుచేశారు.

ప్రాణహిత, గోదావరి కలిసే చోట 100 మీటర్ల దిగువన మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించి, ఆ పైన అన్నారం, సుందిల్ల బరాజ్‌లను నిర్మిం చి ప్రాణహిత జలాలను వినియోగంలోకి తీసుకొచ్చారని, అయితే నిర్మాణ లోపమా? నిర్వ హణ లోపమా? కారణం ఏదైనా పిల్లర్లు కుంగి పోయి, రెండేళ్లు గడిచిపోయాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకే కాదు యావత్ రాష్ట్రానికి ఆధారం అని, హైదరాబాద్ దాహార్తి తీర్చడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు, మూసీ ప్రక్షాళన కూడా ప్రాణహితపై ఆధారపడి ఉన్నదని పేర్కొన్నారు.

కడెం, ఎస్‌ఆర్‌ఎస్సీ నుంచి 100 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశం ఉందని చెప్పారు. అదృష్టం కొద్దీ వాతావరణం అనుకూలంగా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడిహట్టి కింద తవ్విన కాలువలను రీడిజైన్ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చిందని గుర్తుచే శారు. యావత్ తెలంగాణకు ఆధారమైన ప్రా ణహిత జలాలను వినియోగించుకునేందుకు కనీసం డిజైన్ కూడా రూపొందించలేదని, బడ్జెట్‌లో కేవలం రూ.152 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సమర్పించి ఏడాది గడుస్తున్నా మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకో లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్ మరమతు లు చేయకపోతే ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని నొక్కిచెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బరాజ్‌ల నిర్మాణ వ్యయం రూ.8 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు.

నిర్మాణాత్మకంగా ఆలోచించాలి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శనాత్మకంగా చూడటమే తప్ప, నిర్మాణాత్మకంగా నీటిని వినియోగించుకునేల ఆలోచించకపోవడం దుర దృష్టకరం అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించకుంటే తెలంగాణ ఎడా రిగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల రాష్ట్ర ప్రజల సొత్తు అని చెప్పారు. ఎస్‌ఎల్బీసీ కుంగిపోయి కార్మికులు మృతి చెందారని, దానిని అలా వదిలేయకుండా నిర్మించేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తున్నది కదా అని గుర్తుచేశారు.

అలాంటప్పుడు మేడిగడ్డ పునరుద్ధరణ గురించి ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. విమర్శ ఒక భాగం మాత్రమే కావాలని, విమర్శనే జవాబు కాకూడదన్నారు. మేడిగడ్డను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకు రావడానికి ఆలోచించాలని పేర్కొన్నారు. రా బోయే రెండేళ్లలో తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాదని, మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాలు, హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు.

పునరుద్ధరణ చేపట్టకపోవడంతో మన నీళ్లు పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్నాయని తెలిపారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం గా పునరుద్ధరణ చేపట్టకపోతే తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం కాళేశ్వరం బరాజ్‌ల పునరు ద్ధరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలకు కృతజ్ఞతలు

ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని, బీజేపీ, బీఆర్‌ఎస్  నాయకులకు తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు అని జీవన్‌రెడ్డి తెలిపారు. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపిన తర్వాత అమలు చేయలేదని గుర్తుచేశారు. కారణం ఏదైనా తన సహచరుడిని కోల్పోయానని తెలిపారు. తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేనని, తన అడ్డు తొలగించుకోవాలనే నామినేటెడ్ పోస్టులు భర్తీలో జాప్యం చేసినట్టు కనపడుతున్నదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో జీవన్‌రెడ్డి అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు.