4 April, 2026 | 4:57 AM

టీఆర్‌ఎస్.. ఎవరైనా వాడుకోవచ్చు

04-04-2026 02:52 AM
  1. పాత పేరు, కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు
  2. జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే పార్టీ
  3. బీహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరు
  4. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
  5. సీఎం రేవంత్‌రెడ్డే విద్యాశాఖ మంత్రి కావడం మన కర్మ
  6. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సమితి (టీ ఆర్‌ఎస్) పేరు ఫ్రీ అయిందని, ఇప్పు డు దానిని ఎవరైనా వాడుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. పాత పేరు, కొత్త ఎజెండాతో ప్రజల ముం దుకు వస్తానని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కవిత మాట్లాడు తూ.. ఆచార్య జయశంకర్ సిద్ధాం తాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు.

బీఆర్‌ఎస్ ప్రస్తుతం నిద్రావ స్థలో ఉందని విమర్శించారు. రాష్ట్రం లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచ డం మధ్య తరగతి తల్లితండ్రులకు తలకు మించిన భారంగా మారుతోందని అన్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్ర ణ చట్టం తీసుకురావాలని, అధిక ఫీ జుల వసూళ్లను కట్టడి చేయాలని కోరారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేవటంలో విఫలమైందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పు డు రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయనే సీఎం గా ఉండి ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన విద్య కమిషన్ అతి చెత్త నివేదిక ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజుల దోపిడీని ప్రోత్సహించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం కూడా ఫీజుల దోపిడీని ప్రోత్సహిస్తే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

కార్పొరేట్, నార్త్ ఇండియన్ స్కూల్స్ ఏర్పాటుతో తెలంగాణ నిరుద్యోగులకు అన్యా యం జరుగుతోందని ఆందోళన వ్య క్తంచేశారు. నారాయణ, చైతన్య లాం టి స్కూల్స్‌లో లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారని, ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఆయా సంస్థ లు వివిధ పేర్లతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతున్నాయని చెప్పారు. కనీసం మంచి ఫుడ్, టీచర్లకు పీఎఫ్, మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా సరిగా ఇవ్వటం లేదన్నారు.

విద్యార్థుల  తల్లితండ్రులను గౌరవించని స్కూల్స్‌పై రైడ్స్ చేయాలని డి మాండ్ చేశారు. కార్పొరేట్ స్కూల్స్ సొంతంగా ప్రింటింగ్ ప్రెస్‌లు పెట్టుకొని రూ.2 వేల విలువైన పుస్తకాలను రూ.15 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఫీజ్‌రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదనే కారణంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలను కోల్పోతున్నారని ఆందోళన వ్య క్తంచేశారు.

ఫీజుల నియంత్రణ చట్టం తెస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడం మన కర్మ అన్నారు. విద్యావ్యవస్థ ఆగమవుతుంటే, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే కనీసం సీఎం రివ్యూ కూడా చేయటం లేదన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని తెలి పారు. తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పు డు నిజామాబాద్‌కే పరిమితం చేశారని, అయినా నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలను నిజామాబాద్‌కు రాకుండా అడ్డుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రా గానే వేర్వేరు పేర్లతో ఆ సంస్థలు నిజామాబాద్‌కు వచ్చాయని అన్నారు.