బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి అరబిందో ఫార్మా ముందడుగు
17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం నిర్మాణానికి అంగీకారం
ఫలించిన జగ్గారెడ్డి ప్రయత్నం
సంగారెడ్డి, మే 1 (విజయక్రాంతి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వినతి మేరకు సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి చేసేందుకు అరబిందో ఫార్మా మరోసారి ముందుకు వచ్చింది. గతంలో రూ.6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా జి ప్లస్ వన్ భవనాన్ని అరబిందో ఫార్మా నిర్మించింది.
సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థులే కాకుండా నారాయణ్ ఖేడ్, వికారాబాద్, బాన్సువాడ, పరిగి, జహీరాబాద్ ల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా డిమాండ్ ఉన్నప్ప టికీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్లు ఇవ్వలేకపొతున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జగ్గారెడ్డి వెంటనే అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డిని సంప్రదించారు.
అవసరమైన సిఎఎస్‌ఆర్ నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. జగ్గారెడ్డి వినతి మేరకు అదనపు తరగతి గదులతో పాటు ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. అందులో భాగంగా జగ్గారెడ్డి, నిర్మలతో కలిసి అరబిందో డైరెక్టర్ సదానందరెడ్డి బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ సునీతతో సమావేశమయ్యారు.
కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మూడు అంతస్తుల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, త్వరలో బిల్డింగ్ ప్లాన్, కావాల్సిన అనుమతులు తీసుకుంటామని అరబిందో ప్రతినిధులు వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 17 తరగతి గదులు అందుబాటులోకి వస్తే మరో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వగలమని కళాశాల ప్రిన్సిపాల్ సునీత సంతోషం వ్య క్తం చేశారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న జగ్గారెడ్డి, నిర్మలకు, అరబిందో యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.






