సంగారెడ్డి జిల్లాలో పని చేయడం గొప్ప అనుభూతి
సంగారెడ్డి, మే 1(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని ఇటీవల బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. రహదారులు, భవనాల ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య బదిలీపై వెళ్లిన సందర్భంగా గురువారం రాత్రి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదే వేదికపై నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్కు స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని, బదిలీ పై వెళ్లిన కలెక్టర్ ప్రావీణ్య సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ, తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కింది స్థాయి ఉద్యోగి నుంచి ప్రతి శాఖాధికారి వరకు అందరూ సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు.
జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో అందరి సహకారం ఎంతో కీలకంగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్గా రావడం సంతోషకరమని, ఆయన నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అధికారులు ఇదే సమన్వయంతో నూతన కలెక్టర్కు సహకరించాలని సూచించారు. నూతన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రావీణ్య జిల్లా కలెక్టర్గా తనదైన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు.
జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, రెవెన్యూ, ట్రెసా. ఇనియన్.అధ్యక్షులు గంగాధర్.కిరణ్ కుమార్ టీఎన్జీఓ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






