12-09-2025 07:41:25 PM
గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. శుక్రవారం గద్వాల మున్సిపల్ పరిధిలోని జమ్మిచెడు కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు.ఇంటి నిర్మాణం పనులలో నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డులో ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 05 మంజూరు కాగా, పనులన్నీ వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకునేలా వారికి అవసరమైన ఇసుక మట్టి అందించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లను నిర్మించడానికి అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వ నిధులను ఎప్పటికప్పుడు డబ్బులు వారి ఖాతాకు జమ చేయాలని కలెక్టర్ తెలిపారు. టెక్నికల్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పనులను పూర్తి చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలని అన్నారు.