12-09-2025 08:53:18 PM
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మోండా డివిజన్ లో పర్యటించి కోటి 34 లక్షల రూపాయల వ్యయంతో మూడు చోట్ల చేపట్టనున్న CC రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా బండిమెట్ లో 39.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు, జైన్ టెంపుల్ సమీపంలో 49.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు, రాజేశ్వరి థియేటర్ వెనుక 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు పనులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ముందుగా స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలువురు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా విద్యుత్ స్తంభాలపై కుప్పలుగా ఉన్న కేబుల్ వైర్లు, క్రిందకు వేలాడుతున్న వైర్లతో ప్రమాదం పొంచి ఉన్నదని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే కేబుల్స్ తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా మోండా డివిజన్ లోని బండి మెట్ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించడం జరిగిందని చెప్పారు.
వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లైన్ లను నిర్మించడం జరిగిందని, నేడు నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల ను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారానికి నోచుకోని అనేక దీర్ఘకాలిక సమస్యలను బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపినట్లు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ CC రోడ్ల నిర్మాణం పూర్తయితే 30 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటాయని అన్నారు.