12-09-2025 08:45:23 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని కమలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు డైలీ వేజ్ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు అయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్, పార్ట్ టైం వర్కర్లకు గత 30 సంవత్సరాలు పైగా జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారని కానీ ఇప్పుడు 2021 జూన్ 15వ తేదీన బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో 64 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారని దీని ఫలితంగా డైలీ వేజ్ వర్కర్ల వేతనాలు తగ్గుతున్నాయని డైలీ వేజ్ వర్కర్లకు అన్యాయం జరుగుతుందన్నారు.
212 జీవోను సవరించి 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత సమ్మె కాలపు వేతనాలు డైలీ వేజ్ వర్కర్లకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త మోను వల్ల పెరిగిన పని భారనికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని,పూర్తి కాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను డైలీ వేజ్ వర్కర్లగా నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పాటుగా కార్మికులకు కూడా రెండు జతల యూనిఫాం, ఐడి కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్లందరికీ వేతనంతో కూడిన వారంతపు సెలవులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.