calender_icon.png 12 September, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాల విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు చేయాలి

12-09-2025 08:50:29 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కళాశాల విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్.ఆర్.ఎస్.) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 44  ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల జూనియర్ కళాశాలలు ఉన్నాయని,

కళాశాలలలో విద్య అభ్యసించే ప్రధమ, ద్వితీయ, ఒకేషనల్ విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు చేయాలని, సాంకేతికపరమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రతి కళాశాలలో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్.ఆర్.ఎస్.) ను 100 శాతం పూర్తి చేయాలని, విద్యార్థుల హాజరు ఎఫ్.ఆర్.ఎస్. ద్వారా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మౌలిక వసతుల కల్పన కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.