01-10-2025 08:18:07 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఏటా ఇల్లెందు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించే దసరా వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తావివ్వకుండా సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను కోరారు. బుధవారం ఇల్లెందు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా పండగ సందర్భంగా ఇల్లెందు జే కే సింగరేణి గ్రౌండ్‌లో గురువారం నిర్వహించే జమ్మి వేడుకలకు స్థానిక ప్రజలు సహకరించాలన్నారు. ఇల్లెందు పట్టణంలో ఉత్సవం జరుగు సమయంలో పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్డు మీదికి పంపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఉత్సవాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇల్లెందు పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ తాటిపాముల సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.