14 August, 2026 | 2:58 AM

బీసీ మహిళలకు ఆటోమెటిక్ కుట్టుమిషన్లు

14-08-2026 12:23 AM

మేర మహిళలకు మొదటి ప్రాధాన్యత: మేర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వెంకటరాజం

ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని119 నియోజకవర్గాల్లో అర్హులైన పేద, మధ్యతరగతి బీసీ మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకటరాజం తెలిపారు.

ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేర కార్పొరేషన్ వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి 1,000 కుట్టు మిషన్లను పూర్తి సబ్సిడీతో అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళలు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు టిజీ ఎంఎంఎస్ మీ-సేవ/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మేర మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత

జీవో నంబర్ 2లో కుట్టు వృత్తిని ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్న మేర కులస్తుల మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొనడం హర్షణీయమని సంగ వెంకటరాజం అన్నారు. మేర మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను కలిసి వినతిపత్రం అందించామని, తమ విజ్ఞప్తిని అంగీకరించినందుకు సీఎ ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. మేర కులానికి చెందిన అర్హులైన మహిళలు కుల, ఆదాయ, ఆధార్, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేర సంగం ప్రతినిధులు  మునగాల రమేష్, కొత్తకొండ పురుషోత్తం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.