అక్రమ లేఅవుట్లకు అండ
పైసలిస్తే ఏ పనైనా సక్రమమే!
రియల్టర్లు, తహసీల్దార్, రిజిస్టర్ కుమ్మక్కు
ప్లాట్లు కొన్న వారికి శఠగోపం
మున్సిపల్ లేఅవుట్ లేకుండానే విక్రయాలు
-రూ.కోట్లు దండుకుంటున్న రియల్టర్లు
అధికార పార్టీ నేత సహకారంతోనే దందా?
హుజరాబాద్, ఏప్రిల్ 22: ఆ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా పైసలు ఇవ్వా ల్సిందే.. అది సక్రమమైన, అక్రమమైనా.. పైసలిస్తే చాలు దాన్ని సక్రమంగా మార్చే సత్తా ఆ అధికారులకు ఉంది. ఇంకా అధికారంలో ఉన్న పార్టీ నేతలు చెప్తే తిమ్మిని బమ్మి చేసేందుకైనా వెనుకాడరు. గత ప్రభుత్వంలోని అధికార పార్టీ నేతలు చెప్పిన పనులు చేసిన విధంగానే ప్రస్తుత అధికార పార్టీ నేత లు చెప్తే జీ హుజూర్ అంటూ చేసేస్తున్నారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలోని వ్యవసాయ భూమిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వ అనుమతులు పొందకుండానే లేఅవుట్‌గా మార్చారు. లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే నిబంధన ప్రకారం మున్సిపాలిటీకి ఎకరం భూమిలో 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
వెంచర్ ఏర్పాటు చేసే స్థలంలో ప్రజల అవసరాల దృష్ట్యా మౌలిక వసతులు.. గుడి, పార్కు, పాఠశాల, మురు గు కాలువల నిర్మాణం, విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించి, 30 ఫీట్ల రోడ్లతో ప్లాట్లను ఏర్పాటు చేయాలి. కానీ, ఆ నిబంధనలు తుంగలో తొక్కి వారి ఇష్టానుసారంగా ఓపె న్ వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలను కొనసాగిస్తున్నారు. హుజూరాబాద్ శివారులో బోర్నపల్లి పరిధిలోని సర్వే నంబర్ 324లో రియల్టర్లు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఆ భూమిని చదును చేసి వెంచర్‌గా ఏర్పాటు చేశారు. మూడున్నర ఎకరాల భూమికి ఒక ఎకరానికే నాలా కన్వర్షన్ చేశారు. మున్సిపల్ లేఅవుట్ లేకుండానే కేవలం నాలా కన్వర్షన్‌తో ఎక్కడ హద్దు రాళ్లు పెట్టకుండా ప్లాట్ల క్రయవిక్రయాలు చేస్తున్నారు. గజం భూమికి సుమారు 30 వేల రూపాయలుగా చెప్తూ 200 గజాల చొప్పున ప్లాట్లను ఏర్పాటు చేసి విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇంటి పర్మిషన్ రాదు అని అధికారులు తెలపడంతో లబోదిబోమంటున్నారు.
46 మందికి రిజిస్ట్రేషన్లు..
మూడున్నర ఎకరాల భూమికి గాను ఒక ఎకరమే నాలా కన్వెన్షన్ చేయడంలో రెవె న్యూ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం కాకుండా ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లించడం రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరించినట్టు తెలిసింది. ఈ భూమిని రియల్టర్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని సబ్ రిజిస్టార్ కార్యాలయం లో ప్లాట్లు కొన్న వారికి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించారు. 46 మంది కి రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. ఈ విషయంలో సబ్ రిజిస్టర్ మున్సిపల్ లేబర్ పరిశీలించకుండానే 46 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడంపై పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు తెలిసింది.
ఇంటి పర్మిషన్ వస్తుందా?
మున్సిపల్ లేఅవుట్ లేకుండా విక్రయించిన ఈ ప్లాట్లలో ఇల్లు నిర్మించుకొనే వారికి ఇంటి పర్మిషన్ వస్తుందా అనే అనుమానాలు కొనుగోలుదారుల్లో వ్యక్తమవుతున్నా యి. ఆగస్టు 2020 లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఇంటి పర్మిషన్ ఇవ్వాలని ప్రభు త్వం నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు తొలగిస్తేనే కొనుగోలు చేసిన వారికి ఇంటి పర్మిషన్ వస్తుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.
అధికార పార్టీ ‘రియల్‘ దందా
అధికార పార్టీకి చెందిన నాయకులే రియల్టర్లు మారడంతో వారి దందా మూడు వెం చర్లు ఆరు ప్లాట్లుగా విరాజిల్లుతుంది. అధికార పార్టీకి చెందిన నాయకులే రియల్టర్లుగా మారడంతో వారి ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటించాల్సి వస్తుందని అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందితో చర్చిస్తున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలను తొలగిస్తుందని ఆశించిన ప్రజలకు మళ్లీ నిరాశే ఎదురవుతుంది. కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమ దందాలు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సదరు పార్టీ నాయకులు గతంలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమ వెంచర్లు వేసిన రియ ల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అక్రమ వెంచర్ల వల్ల మున్సి పాలిటీకి రావాల్సి న 10 శాతం నష్టపోతున్నది. మౌలి క వసతులు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు సదుపా యం తదితర ఏర్పాట్లు చేయకుండానే ప్లాట్లుగా మార్చి అమ్మేస్తు న్నారు. ఇందులో ప్లాట్లు కొన్న ప్రజ లు తరువాత ఇబ్బందులు పడతారు.
టేకుల శ్రావణ్,
యూత్ కాంగ్రెస్ నాయకుడు
రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ..
మున్సిపల్ లేఅవుట్ లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేశాం. మున్సిపల్ లేఅవుట్ లేకుండా వెలిసిన వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి సూచించాం.
సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్,
హుజూరాబాద్






