బాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన
మహబూబాబాద్, జులై 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని గీతాంజలి హై స్కూల్లో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు మహిళల భద్రత, షీ టీం సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. షీ టీం ద్వారా మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదులను పూర్తిగా గోప్యంగా స్వీకరించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
షీ టీంను నేరుగా 8712526935 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112 సేవలను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, ప్రియాంక, ఏహెచ్టీయూ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నాయక్, అరుణ, సుప్రజ, భరోసా కేంద్రం సెంట్రల్ కోఆర్డినేటర్ జోష్ణ, లీగల్ అడ్వైజర్ శ్వేత పాల్గొన్నారు.






