ఎల్‌నినో ప్రభావం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,జులై 27 (విజయ క్రాంతి): ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించి, తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షపాతం లోపాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సూచనలు అందించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచి, పంటల సాగు వివరాలను ప్రతిరోజూ నివేదించాలని ఆదేశించారు.
ఇరిగేషన్ వనరులలోని నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తూ, పంటలకు నీరు విడుదల చేయకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి బాబు రావు, ఉద్యానవన అధికారి తిరుపతి, రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్త డా. మదన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏలు రమేష్, శ్రీపాల్ మరియు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.






