7 July, 2026 | 2:37 AM

హల్దిరామ్ కోసం పోటీ

17-05-2024 12:20 AM

బ్లాక్‌స్టోన్‌తో బెయిన్ క్యాపిటల్, టెమాసెక్ ఢీ

న్యూఢిల్లీ, మే 16: స్నాక్స్ వ్యాపారంలో పేరొందిన హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్స్ మధ్య పోటీ ఏర్పడింది.  ఇప్పటికే  అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్ బ్లాక్‌స్టోన్ నేతృత్వంలోని కన్సార్షియం బిడ్ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. బ్లాక్‌స్టోన్‌కు పోటీ మరో యూఎస్ ఈక్విటీ ఫండ్ బెయిన్ క్యాపిటల్ సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌తో కలిసి బిడ్ చేస్తున్న ట్టు తాజా సమాచారం. బ్లాక్‌స్టోన్ కన్సార్షియంలో అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ జీఐసీలు ఉన్నాయి. 87 ఏండ్లుగా నడుస్తున్న ఈ హల్దిరామ్ గ్రూప్‌లో ఒక భాగమైన ఢిల్లీ, నాగపూర్‌ల్లోని అగర్వాలా కుటుంబం హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నది. ఈ కంపెనీలో 74.76 శాతం వాటాకు బ్లాక్‌స్టోన్, దాని భాగస్వాములు గత వారంలో బిడ్ సమర్పించినట్టు సమాచారం. కంపెనీకి 8 బిలియన్ డాలర్ల విలువ కడుతూ (రూ.66,400 కోట్లు) బ్లాక్‌స్టోన్ బిడ్ చేసింది. హల్దిరామ్ కుటుంబం రెండు భాగాలుగా విడిపోయింది. అందుకు అనుగుణంగా వారి ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపారాన్ని, రెస్టారెంట్ వ్యాపారాన్ని రెండుగా విభజించారు.

అటుతర్వాత నాగపూర్‌లో ఉంటున్న కుటుంబం చేతికి హల్దిరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీలో ఉంటున్న కుటుంబం చేతిలో ఉన్న హల్దిరామ్ స్నాక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను విలీనం చేసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. విలీన కంపెనీలో ఢిల్లీ కుటుంబానికి చెందిన మనోహర్ అగర్వాల్, మధుసూదన్ అగర్వాల్‌లకు 55 శాతం వాటా ఉంటుంది. నాగపూర్ కుటుంబానికి చెందిన కమల్‌కుమార్ శివకిషన్ అగర్వాల్ వద్ద మిగిలిన 45 శాతం వాటా ఉంటుంది. అగర్వాలా కుటుంబంలోని నాగపూర్, ఢిల్లీ  విభాగాలతో గత ఏడు నెలలుగా బెయిన్ క్యాపిటల్ చర్చలు జరుపుతున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి మైనా రిటీ వాటాను కొనుగోలు చేసేందుకు బెయిన్ క్యాపిటల్ ప్రతినిధులు హల్దిరామ్ ఫ్యాక్టరీలను సందర్శించారని, యాజమాన్యాలతో చర్చలు జరిపారని ఆ వర్గాలు పేర్కొ న్నాయి. అయితే వ్యవస్థాపక కుటుంబం ఇప్పుడు మెజారిటీ వాటా విక్రయానికి ఆసక్తి చూపించడంతో బెయిన్ క్యాపిటల్ ఇతర భాగస్వాములను కలుపుకొని బ్లాక్‌స్టోన్‌కు పోటీగా బిడ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. పెప్సికో, కెల్లాగ్ తదితర అంతర్జాతీయ కంపెనీలు, కొన్ని గ్లోబల్ ఈక్విటీ ఫండ్స్, టాటాలకు చెందిన టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గతంలో వాటా కొనుగోలుకు హల్దిరామ్ కుటుంబంతో చర్చలు జరిపాయి. అయితే విలువ విషయమై అంగీకారం కుదరలేదు.