7 July, 2026 | 1:32 AM

4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్

17-05-2024 12:24 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే జపాన్‌ను దాటేస్తాం..

ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్

న్యూఢిల్లీ, మే 16: ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ అధిగమిస్తుందని అంచనా వేశారు. గురువారం న్యూఢిల్లీలో ఒక సదస్సులో సన్యాల్ మాట్లాడుతూ అనిశ్చితుల మధ్య 7 శాతం వృద్ధి అనేది భారత్‌కు మంచి వృద్ధి రేటు అని చెప్పారు. ప్రస్తుతం భారత్ 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. ఇప్పుడు జపాన్ జీడీపీ మనకంటే కాస్త ఎక్కువగా 4.1 ట్రిలియన్ డాలర్ల మేర ఉన్నదని, వచ్చే ఏడాది తొలినాళ్లలో లేదా ఈ ఏడాదే జపాన్‌ను భారత్ అధిగమించి నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని సంజీవ్ సన్యాల్ చెప్పారు. 

రెండేండ్లలో జర్మనీని మించుతాం

 జర్మనీ ఆర్థిక వ్యవస్థ 4.6 ట్రిలియన్ డాలర్లని, ఆ దేశం జీడీపీ వృద్ధిచెందడం లేదని, అందుచేత రెండేండ్లలో భారత్ జర్మనీని సైతం దాటేసి మూడో పెద్ద ఎకానమీగా రూపొందవచ్చని వివరించారు. ‘మనం దాదాపు లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాం’ అని చెప్పారు. ఆర్థికాభివృద్ధి రేటును 8 శాతానికి పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చర్యలూ చేపట్టాల్సిన అవసరం లేదని సన్యాల్ అభిప్రా యం వ్యక్తం చేశారు.  ‘ఆ వృద్ధి రేటును (8 శాతం) సాధించగలిగితే గొప్పే, అయినా 7 శాతం వార్షిక వృద్ధి సైతం మంచిదే’ అని చెప్పుకొచ్చారు. ఈ వృద్ధి రేటుతో ఉపాధి, పన్నులు రెండూ పెరుగుతాయన్నారు. వృద్ధి మరింత వేగవంతం కావాలని ఆశించవద్దని సన్యాల్ అంటూ ఇండోనేషియా, మలేషియా తదితర దక్షిణాసియా దేశాలు 1990 దశకంలో ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఉన్నాయని, అవి అటుతర్వాత మరింత జోరుచూపించి ఒక్కసా రిగా చతికిల పడ్డాయని, దానితో ఆసియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించారు.