వొడాఫోన్ ఐడియాకు భారీ నష్టం
క్యూ4లో రూ.7,675 కోట్లు
న్యూఢిల్లీ, మే 16: వొడాఫోన్ ఐడియా కన్సాలిడేటెడ్ నికరనష్టం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో భారీగా పెరిగి రూ.7,675 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకా లంలో రూ.6,419 కోట్ల నికరనష్టాన్ని చవి చూసింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.10,532 కోట్ల నుంచి స్వల్పంగా రూ.10,607 కోట్లకు పెరిగింది. టెలికం కంపెనీల మెరుగుదలను సూచించే ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) 7.6 శాతం వృద్ధిచెంది రూ.135 నుంచి రూ. 146కు పెరిగింది. ఈ మార్చి క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా ఇబిటా రూ.4,210 కోట్ల నుంచి రూ. 4,336 కోట్లకు చేరింది. ఇదే తమకు అత్యధిక ఇబిటా అని కంపెనీ తెలిపింది. 4జీ చందాదారుల సంఖ్య 12.26 కోట్ల నుంచి రూ.12.63 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. 2023 పూర్తి సంవత్స రంలో వొడాఫోన్ ఐడియా ఆదాయం 1.1 శాతం వృద్ధితో రూ.42,180 కోట్ల నుంచి రూ. 42,650 కోట్లకు చేరింది. వరుసగా రెండో ఏడాది తమ వార్షిక ఆదాయం, ఇబిటాలు పెరిగాయని, తక్కువ పెట్టుబడుల తోనే గత కొద్ది త్రైమాసికాల్లో పనితీరు మెరుగుపడుతున్నట్టు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చెప్పారు.
కేంద్రం బకాయిలు రూ.2.03 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు రూ.2,03,430 కోట్లని వొడాఫోన్‌ఐడియా తెలిపింది. ఇందులో స్పెక్ట్రం బకాయిలు రూ.1,33,110 కోట్లు కాగా, ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్ల మేర ఉన్నాయని కంపెనీ వివరించింది. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన రుణం రూ.4,040 కోట్లని, గత ఏడాదిలో ఈ రుణాన్ని రూ.7,090 కోట్ల మేర తగ్గించుకున్నట్టు వెల్లడించింది. 2024 మార్చి 31నాటికి నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.170 కోట్ల మేర ఉన్నదన్నది.






