29 May, 2026 | 3:34 AM

బహుముఖ ప్రతిభావంతుడు సురవరం

29-05-2026 02:10 AM
  1. తెలంగాణ సారస్వత పరిషద్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
  2. ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి 

ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): బహుభాషావేత్తగా, సాహితీవేత్తగా, చరిత్రకారుడుగా, పత్రిక సంపాదకుడుగా, గ్రంధాలయ ఉద్యమ సారధిగా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన సురవరం ప్రతాప రెడ్డి బహుముఖ ప్రతిభావంతుడు అని తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు  ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి కొనియాడారు. సురవరం ప్రతాప రెడ్డి 130వ జయంతి సందర్బంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గల సురవరం ప్రతాప రెడ్డి విగ్రహానికి ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి తదితరులు హాజరై  ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి  మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్న తెలుగు భాషా సంస్కృతులకు దిశా నిర్దేశం చేసిన ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాప రెడ్డి అని తెలిపారు.1942లో ’ఆంధ్ర గ్రంథాలయ ఉద్యామానికి’ ఆయన అధ్యక్షులుగా పనిచేసారని, 1943లో ఖమ్మంలో జరిగిన ’గ్రంథాలయ మహాసభ’ కు  అద్యక్షత వహించారని, ప్రతిష్టాత్మకమైన ’ఆంధ్ర సారస్వత పరిషత్’ కు ఆయన 1944లో అధ్యక్షులుగా పనిచేసారని గుర్తు చేసారు.

‘తెలంగాణలో కవులే లేరు‘ అని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముడంబ వెంకట రాఘవాచార్యులు అనే కవి నిందిస్తే దీనిని సవాలుగా తీసుకున్న సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణలో గొప్ప కవులు ఉన్నారని నిరూపించడానికి అవిశ్రాంత పరిశోధన చేసి,1934లో 354 మంది తెలంగాణ కవుల పద్యాలు, కవితలు, వివరాలతో ’గోలకొండ కవుల సంచిక’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచురించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు కార్యదర్శి సురవరం పుషలత రెడ్డి, ట్రస్ట్ సభ్యులు సురవరం కృష్ణ వర్ధన్ రెడ్డి, సురవరం కుటుంబ సభ్యులు, రచయితలు, కవులు పాల్గొన్నారు.