బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి
బాన్సువాడ, మే 18 (విజయ క్రాంతి): రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రజలు శాంతియుత వాతావరణం లో పండుగను జరుపుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం లో డి.ఎస్.పి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బాన్సువాడ పోలీస్ స్టేషన్ అధికారులతో పాటు పట్టణానికి చెందిన హిందూ, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ అందరూ సోదరభావంతో మెలిగి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ తుల శ్రీధర్ మత పెద్దలు వివిధ రాజకీయ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.






