16-12-2025 01:28:41 AM
రియల్ ఎస్టేట్ సంస్థకు సాగిలపడిన వ్యవస్థలు
అనుమతులు లేవని, నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకున్న మైనింగ్, రెవెన్యూ శాఖలు
ఆటోనగర్‌లో అనుమతులకు మించి అక్రమ తవ్వకాలు
అక్రమాలను అడ్డుకోవాలని స్థానికుల డిమాండ్
ఎల్బీనగర్, డిసెంబర్15 (విజయ క్రాంతి): ఆర్థిక, రాజకీయ బలం ఉంటే రాజ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు ఎలా సాగిలపడు తాయో... నమిశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ ఒక ఉదాహరణ. ‘నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ అండ్ ప్రాజెకట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మా ణ సంస్థ అక్రమాలకు అడ్డూ అదుపులే కుండా పోతోంది. అనుమ తులకు మించి మట్టి తవ్వకాలు, మట్టి దందా చేస్తూ.. ప్రభుత్వ ఆదాయ వనరులకు గండి కొడుతుంది.
ఎల్బీనగర్ నియోజక వర్గంలో ఆయా ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణాల పేరుతో నమిశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తూ మార్కెట్ లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో మైనింగ్, రెవెన్యూ శాఖలు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. భారీ స్థాయిలో జరిమానా విధించినా... నాకు ఎవరూ అడ్డు అంటూ యథావిధిగా మట్టి తవ్వకాలు చేస్తుంది.
జవాబుదారీతనం లేని’నమిశ్రీ’!
మన్సూరాబాద్ డివిజన్ లోని ఆటోనగర్ సర్వే నంబర్ 38లో ఉన్న సుమారు సుమారు ఐదున్నర ఎకరాల్లో నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంస్థ భారీస్థాయిలో హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందు కోసం జులైలో సెల్లార్ తవ్వకాలు ప్రారంభించింది.
సెల్లార్ తవ్వకాల కోసం భారీ రాళ్లను బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చేయడంతో భారీ శబ్దాలకు సమీప కాలనీల్లో ఉన్న ఇండ్లకు పగుళ్లు రావడంతో స్థానికులు మైనింగ్ శాఖ అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు మైనింగ్ అధికారులు ఆగస్టు నెలలో ఆటోనగర్ లో చేపట్టిన పనులను పరిశీలించి, రూ.79 లక్షల జరిమానా విధిస్తూ నోటీస్ ఇచ్చారు.
దీంతో వారం రోజులు మట్టి తవ్వకాలు ఆపిన నమిశ్రీ కంపెనీ.. తర్వాత మళ్లీ యథావిధిగా తవ్వకాలు చేపట్టారు. మళ్లీ స్థానికులు రంగారెడ్డి జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్, సరూర్ నగర్ తహసీల్దార్ వేణుగోపాల్ ఇతర శాఖల అధికారులకు మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసి, చేతులు దులుపుకున్నారు. కానీ, యథావిధిగా పనులు జరుగుతున్నా మళ్లీ అటువైపు మైనింగ్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
నోటీసులు ఇచ్చినా లెక్క చేయని నమిశ్రీ
మన్సూరాబాద్ లోని ఆటోనగర్ లో హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చేపట్టిన నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంస్థ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించింది. ఉన్నతస్థాయిలో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తీసుకున్నది. కానీ, క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని జిల్లా మైనింగ్ అధికారులు, సరూర్ నగర్ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ. కోటికి పైగా జరిమానా విధిస్తూ రెండుసార్లు జిల్లా మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
పనులకు అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు సైతం నోటీసులు ఇచ్చారు. నోటీసులు లెక్క చేయకుండా మట్టి తవ్వకాలు, మార్కెట్లో మట్టి విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ... మా స్థాయిలో నోటీసులు ఇచ్చామని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని తేల్చిచెప్పారు. వనస్థలిపురం పోలీసులు మాట్లాడుతూ... మాకు ఫిర్యాదు వస్తే అధికారులకు రక్షణ కల్పిస్తామని, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది మైనింగ్, రెవెన్యూ శాఖలేనని అన్నారు.