భారత్‌లో బంగ్లా దౌత్యవేత్తలపై వేటు
- ఢిల్లీ, కోల్‌కతాలోని ఇద్దరు అధికారుల సస్పెండ్
- నిర్ణయం తీసుకున్న యూనస్ ప్రభుత్వం
- పొరుగుదేశంలో కొనసాగుతున్న అల్లర్లు
- ఆదివారం జరిగిన ఘర్షణలో 50మందికి గాయాలు
ఢాకా (బంగ్లాదేశ్), ఆగస్టు 26: బంగ్లాదేశ్ సంక్షోభం నెలకొన్న వేళ భారత్‌లోని ఇద్దరు దౌత్య అధికారులపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్న షబాన్ మహమ్మద్, కోల్‌కతాలోని కాన్సులేట్‌లో పనిచేస్తున్న రంజన్‌సేన్‌పై వేటు వేసింది. తన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయాలని బంగ్లా ప్రభుత్వం షబాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం హింసాత్మకంగా మారడం, ఆ తర్వాత ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అన్ని దేశాలతో సఖ్యతను కొనసాగిస్తామని యూనస్ ఇప్పటికే ప్రకటించారు.
కొనసాగుతున్న ఘర్షణలు
బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఢాకాలో ఆదివారం రాత్రి విద్యార్థులు, పారామిలిటరీకి చెందిన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 50 మంది వరకు గాయపడ్డారు. అన్సార్ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజులు నిరసనలు చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆదివారం ఆందోళన విరమించారు. దీంతో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. వీటిని అన్సార్ సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లామ్ సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాత్రివేళ విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టగా హింసాత్మకంగా మారి ఘర్షణకు దారితీసింది.




