గడ్డి మందు నిషేధం
- అసెంబ్లీలో మంత్రి తుమ్మల తీర్మానం
- కేంద్రానికి నివేదిక
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణలో పారాక్వాట్, డైక్లోరైడ్ (గడ్డి మందు)ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సభలో ప్రవేశపెట్టారు. రైతులు వ్యవసాయానికి వాడుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రమాదకరంగా మారిందని.. అందుకే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సభ్యులకు మంత్రి వివరించారు. ఇది ప్రాణాంతక రసాయనమని, దీన్ని అనేక దేశాల్లో నిషేధించారని తెలిపారు.
పారాక్వాట్, డైక్లోరైడ్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వాడి అనేక మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. సుస్థిర సేంద్రీయ వ్యవసాయ లక్ష్యాలకు ఇది అడ్డుగా మారిందని, దీని తయారీ, వాడకం, రవాణా, దిగుమతి ఇలా అన్ని విధాలుగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గడ్డి మందుని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు.
యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి: భట్టి తీర్మానం
అమెరికా, ఇజ్రాయెల్,- ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రభావం ఆసియా దేశాలపై తీవ్రంగా పడుతోందని.. ఆర్థిక విధ్వంసం జరుగుతోందని తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడాయిల్ ఉత్పత్తి, రవాణా సరఫరాలో ప్రభావం చూపిస్తున్నదని అన్నారు. మరణాలు ఆయా దేశాలకు పరిమితమైతే, ఆర్థిక విధ్వంసం మాత్రం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నదని చెప్పారు.
ఇంతటితోనైనా ఈ యుద్ధాన్ని ఆపకపోతే ప్రపంచ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అత్యంత ప్రమాదకర పర్యావసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తగిన చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయవాదుల రక్షణకు కృషి: మంత్రి శ్రీధర్‌బాబు
‘న్యాయవాదులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఇది బాధాకరం. వారి రక్షణ మనందరి బాధ్యత’ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శాసన సభలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుపై మంత్రి మాట్లాడారు. ‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో పట్టపగలే న్యాయవాది గట్టు వామనరావు దంపతులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇప్పటికీ అసలు దోషులను గుర్తించలేదని, సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది’ అన్నారు.
అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో పోలీస్‌లు గట్టు వామనరావు దంపతుల కేసును నీరుగార్చారని, అసలు దోషుల్ని తప్పించేలా విచారణను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ ఘటన తర్వాతి నుంచి తమ ప్రొటెక్షన్ కోసం ఓ ప్రత్యేక చట్టం కావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూనే ఉన్నారని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, న్యాయవాదులపై దాడులు జరిగినా స్పందించలేదన్నారు. తమ ప్రభుత్వం న్యాయవాదుల సంరక్షణకు కట్టుబడి ఉందని, అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్‌ను ఈరోజు సభలో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.




