అవగాహనతో డిజిటల్ మోసాలను అధిగమించండి
గీతం విద్యార్థులకు సైబర్ నిపుణుల సూచన
పటాన్ చెరు, మార్చి 30 : సైబర్ నేరాలను నివారించడానికి అవసరమైన జ్జానాన్ని సమకూర్చుకుని, అవగాహనతో డిజిటల్ మోసాలని అధిగమించాలని హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సైబర్ నిపుణులు సూచించారు. సైబర్ భద్రతపై మరింత అవగాహనను సమాజంలో వ్యాప్తిచేయగల బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఎదగాలని అభిలషించారు. గీతంలోని సైబర్ స్పేసుపై అవగాహన, బాధ్యతాయుతమైన కార్యక్రమం (స్పార్క్ క్లబ్) విద్యార్థుల కోసం ‘సైబర్ అవగాహన, చైతన్య సదస్సు’ను సోమవారం నిర్వహించారు.
దీనిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, న్యూఢిల్లీకి చెందిన ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ (ఐఎఫ్‌ఎఫ్), సైబరాబాదుకు చెందిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ స్వల్ప వ్యవధి శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎస్.వి.హరికృష్ణ, సంగారెడ్డి డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సీఎస్సీకి చెందిన రష్మి శ్రీవాస్తవ, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ (ఐఎఫ్‌ఎఫ్)కు చెందిన శాలిని రాథోర్, శిఖర్ ద్వివేది వంటి నిపుణులు పాల్గొని, సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించారు. డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటంపై ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ, ఆసక్తికరమైన, ప్రయోగాత్మక శిక్షణా కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.




