కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు సికింద్రాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి రెండోసారి తమ స్థానాలను దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి గతంలో మోడీ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. నేడు ప్రమాణస్వీకారం చేయనున్న కేంద్ర మంత్రివర్గంలో తమ చేరికను తెలియజేస్తూ కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో కిషన్ రెడ్డి ఇంటి నుంచి ఒకే కారులో ప్రధాని నివాసంలో జరిగే తేనీటి విందుకు ఇద్దరు నేతలు బయలుదేరారు.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. క్యాబినెట్ లో చోటు దక్కిన వాళ్లకు ప్రధాని కార్యాలయం నుంచి కాల్స్ చేశారు. ఫోన్ కాల్ అందుకున్నవారిలో నితిన్ గడ్కరీ, శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, జితేంద్ర సింగ్, హెచ్‌డీ కుమార స్వామి(జేడీఎస్), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన షిండే వర్గం), కే.రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) తదితరులు ఉన్నారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు.






