26-08-2025 10:58:18 AM
హైదరాబాద్: 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నా.. వార్డు మెంబర్ కానివాళ్లు కూడా విమర్శించడం సరికాదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. దొంగ ఓట్లు అంటూ చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక పంచాయితీలకు ఒక్క పైసా ఇచ్చిందా..? కేంద్రం నిధులు ఇస్తుందనే ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడుతున్నారని పేర్కొన్నారు. రాత్రిపూట యాత్రలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదని, ఓట్ల చోరీ అంటూ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఆయన అన్నారు. ఒకసారి బీసీ అంటారు.. మరోసారి బీసీ కాదంటారు.. గందరగోళంతో ఉన్నారని, కరీంనగర్ లో ప్రతి ఓటూ పరిశీలించి దొంగ ఓట్లు తీసేయాలన్నారు. రెండుచోట్ల ఓటు వేయడం ఎవరికైనా సాధ్యమా..?, దొంగ ఓట్లపై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.
బీజేపీని తిడితే యాత్రను అడ్డుకుంటారు.. భద్రత కల్పిస్తారని కొందరు అంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు.. ఓట్ల గురించి కాదు.. సీట్ల చోరీ గురించి సమాధానం చెప్పాలని అన్నారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు కరీంనగర్ ఓటర్లను అవమానించేలా ఉన్నాయని, పీసీసీ అధ్యక్షుడి మాటలపై సీఎం రేవంత్ స్పందించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని, ఓట్లు చోరీ నిజమైతే మిగతా 8 ఎంపీలూ మేమే గెలిచే వాళ్లం కదా.. అని తెలిపారు. రోహింగ్యాల విషయంలో ఓటు బ్యాంకు రాజకీయలు చేస్తున్నారని, దేశం ముఖ్యమా.. ఓటు ముఖ్యమా అని ఆరోపించారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. రెండూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. నన్ను తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందన్న ఆలోచన అని, ఎన్నికలున్నా.. లేకున్నా.. సనాతన ధర్మం కోసం బీజేపీ ముందుంటుందన్నారు. బైంసాలో పేద హిందువుల కోసం పోరాటం చేశామని, అప్పుడు కాంగ్రెస్ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు.