calender_icon.png 9 September, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డుగోడలు

08-09-2025 12:22:04 AM

ఆ గోడలు కేవలం 

ఇటుకల కట్టడాలు కావు

జ్ఞాపకాలపై రంగులు చల్లే పలకలు

పిల్లల నవ్వులను ప్రతిధ్వనించే తెరలు

పండుగల ముగ్గులను మోసే 

మట్టి పలుకులు

ఫొటోభక్తిని నిలిపే ఫలకాలు

నినాదాలతో వీధి ఉప్పొంగించే పలకలు

ఓ మూలకు తల వంచి కూర్చుంటే 

పరమాత్మ దరిచేరే మార్గమే 

మూసుకుపోతుంది

ప్రార్థనా గీతాల్ని బడి గోడలపై 

రాసినప్పుడు

అవి జ్ఞానానికి సాక్ష్యాలు అవుతాయి

వీటిల్లోనూ ఉన్నవి గోడలే కదా

ఇటుకపై విఠలుడు కూర్చోగా

భక్తికి ప్రతీకమై నిలిచినదీ గోడే

జ్ఞానేశ్వర్ స్వారీ చేసినదీ గోడే

కానీ, మనసు కట్టే గోడలు

అతి భీకరమైన కోటలు

‘నేను నాది’ అనే అహంకారపు రాళ్లతో

దైవ సన్నిధిని దూరం చేసే

అసలు అడ్డుగోడలవే అవి..

అందుకే 

కనిపించే గోడలకంటే

కనిపించని గోడలే

మానవుడి నిజమైన అడ్డుగోడలు

గదులు చేయగలిగిన గోడలు

గృహ సుఖానికే మార్గం

కానీ మనసు కట్టిన గోడలు

మూల సత్యానికి ఆవరణం

పసిబిడ్డ చేతికట్టెగా నిలిచిన గోడ

వృద్ధుడి ఆధారంగా నిలిచిన గోడ

సన్యాసి దాటి చేరిన తోట గోడ

ఇవ్వన్నీ దారిదీపాలే

కానీ హృదయ కట్టెలో కట్టిన గోడలే

అజ్ఞానానికీ అనాథత్వానికీ 

కాపలాదారులు

విచ్ఛిన్నమయ్యే ప్రతి అడ్డుగోడ

ప్రసన్న విహారిణి విప్పిన గూడు

గూడు చెదరగానే గగనమంతా 

పక్షికి శరణం

సాధన రాతితో చెక్కుతూ

అనుభవం మోతతో కొడుతూ

ఆ అజ్ఞాన గోడల్ని కూల్చినప్పుడే

అంతర్యామి దర్శనమిస్తాడు

 డాక్టర్ ఐ చిదానందం