09-09-2025 01:14:49 PM
గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..
కోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పే సమాధానం ఏమిటి?
తెలంగాణ యువతకు రేవంత్ క్షమాపణ చెప్పు..
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో(TGPSC Group-1 Result) అవకతవకలు.. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల(Hull tickets) జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? అని ప్రశ్నించారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నీ నిరాక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదని ఆరోపించారు.
పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు(Government Jobs) ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి అంటూ చురకలంటించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి.. నిర్లక్ష్య, మోసపూరిత వైఖరిని తలదించుకోని తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టు మంగళవారం ఇచ్చిన ముఖ్యమైన తీర్పులో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేసి, ఎనిమిది వారాల్లోగా ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission)ని ఆదేశించింది. కమిషన్ పాటించకపోతే, మొత్తం పరీక్షా ప్రక్రియను రద్దు చేసి, కొత్తగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తామని కోర్టు హెచ్చరించింది.