calender_icon.png 6 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిడ్డ.. ఆత్మబలిదానం

06-12-2025 01:09:14 AM

బీసీ రిజర్వేషన్లపై పాలకుల వైఖరిని నిరసిస్తూ 

నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి

గాంధీలో చికిత్స పొందుతూ కన్నుమూత

* రాష్ట్రం రణరంగమైంది. తన శరీరాన్ని దహించుకుని ఆత్మగౌరవ జెండా ఎత్తిన.. సాయి ఈశ్వర్ మరణంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీ బిడ్డది ఆత్మబలిదానం కాదని.. పాలకుల హత్యేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో  బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని సాగుతున్న పోరులో పాలకుల ద్వంద్వ వైఖరే ఈశ్వర్ అఘాయిత్యానికి కారణమని దుమ్మెత్తి పోశాయి.

న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటా కోసం ఇంకెంత మంది సమిధలు కావాలి.? ఆత్మార్పణతోనే ప్రభుత్వాల్లో చలనం వస్తుందా? అంటూ నిలదీశాయి. పాలక ప్రభుత్వాలు ఇకనైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశాయి.

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 5 (విజయక్రాంతి): ‘ఓట్లు మావి.. సీట్లు మీకా.. మాకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తారా’ అంటూ నినదించిన ఓ బీసీ యువకుడి గొంతుక మూగబోయింది. ప్రభుత్వం చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక, ఆవేదనతో రగిలిపోయి తన శరీరానికే నిప్పం టించుకున్న సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామం యువకుడు సాయి ఈశ్వర్ చారి పోరాటం చివరకు విషాదాంతమైంది. పీర్జాదిగూడలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న ఆఫీస్ వద్ద గురువారం జరిగిన ఈ అఘాయిత్యం.. శుక్రవారం ఉదయం పెను విషాదంగా మారింది. గాంధీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఈశ్వర్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

అసలేం జరిగింది..?

సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ చారి బీసీల హక్కు ల కోసం తపిస్తున్న యువకుడు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ అన్యాయంపై పోరాటం చేయాలని కోరేందుకు గురువారం పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చారు.

తీన్మార్ మల్లన్నను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామనుకున్నారు. కానీ, మల్ల న్న అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రభు త్వం చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక కార్యాలయం బయటే వెంట తెచ్చుకున్న పెట్రో ల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తర లించినా.. తీవ్ర గాయాలపాలైన ఆయన చివరకు ప్రాణాలు విడిచారు.

సీఎం మోసానికి నిండు ప్రాణం బలి

బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి సాయిఈశ్వర్ నిండు ప్రాణం బలైంది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల హామీకి కాంగ్రెస్ తూట్లు పొడిచింది. దీన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లను కేవలం 17 శాతానికే కుదించి, వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిశారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. సీఎం రేవంత్, రాహుల్ గాంధీ ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలి. కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్ నయవంచన చేసింది. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి. 

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

సాయి ఈశ్వరాచారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లనే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది రేవంత్ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనం. హామీలను నెరవేర్చని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్       గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో నిర్వహించాలి. 

 బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

పోరాడాలి తప్ప.. చనిపోవద్దు

42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు.. చివరకు అది 21.39 శాతానికి పడిపోవడం మింగుడు పడటం లేదు. ఈ పరిణామంతో బీసీ సమాజం ఎంత మానసిక ఆవేదనకు గురవుతుందో చెప్పడానికి సాయి ఈశ్వరాచారి మరణమే నిదర్శనం. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించే వరకూ పోరాటం చేయాలి తప్ప.. మానసికంగా కలత చెంది ప్రాణాలు తీసుకోవద్దు. సాయి ఈశ్వరాచారి బలిదానం రిజర్వేషన్ అమలయ్యే వరకూ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలి.

 బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్

బాధ్యత కాంగ్రెస్ సర్కార్‌దే..

సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలి. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారమే ఈ దారుణానికి కారణం. బీసీలకు సరైన అవకాశాలు, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటలు చెప్పి, తీరా ఆ హామీని నిలుపుకోకుండా మోసం చేయడంతోనే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు కారణ మైంది. -ఇది బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వ్యవహార శైలికి ప్రతిబింబం. ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలి.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదు

బీసీ బిడ్డ ఆత్మ బలిదానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర్ బలికావడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. రేవంత్‌రెడ్డి అధికార దాహానికి యువకుడి ప్రాణం బలైంది. సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలి. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 

 మాజీ మంత్రి హరీశ్‌రావు