22 August, 2026 | 8:47 AM

బీసీ జనసభ మెరుపు ధర్నా

23-05-2024 01:09 AM

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు డిమాండ్

జూన్ 15న సచివాలయం ముట్టడికి వ్యూహం

బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ 

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నిలకు వెళితే సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అద్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ జనసభ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. వారిని పోలీసులు అడ్డుకోబోగా కాసింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  కామారెడ్డి విజయభేరీ సభలో  ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కులగణన, బీసీలకు సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందిన కాంగ్రెస్  బీసీల గోడు పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నిలకు వెళితే జూన్ 8న ఇందిరాపార్క్ వద్ద ధర్నా  నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాక పోతే జూన్ 15న సచివాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  కార్యక్రమంలో  ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.