22 August, 2026 | 7:51 AM

యాదాద్రీశుడికి సహస్ర కలశాభిషేకం

23-05-2024 01:17 AM

విశ్వశాంతి లోక కల్యాణార్ధం పూర్ణాహుతి

వైభవంగా నృసింహ ఆవిర్భావ వేడుకలు

యాదాద్రి భువనగిరి, మే 22 (విజయక్రాంతి): నృసింహుడి ఆవిర్భావ వేడుకలు యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా నిర్వహిం చారు. ఉదయం విశ్వశాంతి లోక కల్యాణం కాంక్షిస్తూ మహాపూర్ణాహుతి గావించారు. వెయ్యి కలశాలలో సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, పంచామృత జలాలకు వేద ప్రమాణాలతో మంత్రించారు. ఈ పుణ్యజలాలతో గర్భాలయంలో నృసింహుడి మూల విరాటుకు సహస్ర కలశాభిషేకం చేశారు. సాయంత్రం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య స్వామివారిని ప్రసన్నంగావించే మంత్రోచ్చారణలు జరిపి  నృసింహ ఆవిర్భావ తిరునక్షత పూజలను ఆగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ అనువంశిఖ ధర్మకర్త బీ నర్సింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు, ఉప కార్యనిర్వహణాధికారి దోర్బల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.