21-01-2026 01:34:55 AM
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
జవహర్ నగర్, జనవరి 20 (విజయక్రాంతి): సహజీవనానికి ఓ నిండు ప్రాణం బలైంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి పై ఆమె కుమారుడు కోపం పెంచుకుని ఆమె మృతికి కారకుడయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల మేరకు జవహర్‌నగర్‌లోని విఘ్నేశ్వర కాలనీలో ఉంటున్న పొట్టోళ్ల రజిని(40) తన ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. జమీల్ (38) అనే వ్యక్తితో రజిని కొంత కాలంగా సహజీవనం చేస్తుంది. ఇది ఆమె చిన్న కుమారుడైన రాజకరణ్ (24) కు నచ్చకపోవడంతో... జమీల్ పై కోపం పెంచుకున్నాడు.
అయితే ఇటీవల రాజ్ కరణ్ దొంగతనాలు చేస్తున్నాడని జమీల్ పోలీసులకు అప్పజెప్పడంతో అతని పై మరింత కోపం పెంచుకుని.. జమీల్ ను ఎప్పటికైనా అంతమొందించాలని పథకం వేశాడు. ఈ విషయాన్ని రాజ్ కరణ్ స్నేహితులైన కృష్ణ, సోయబ్, సోయల్, మానిక్‌లకు తెలిపాడు. ఈ నెల13న తల్లి రజిని, జమీల్ ను రాజ కరణ్ తన ఇంటికి పిలిపించుకున్నాడు. జమీల్, రాజ్ కరణ్ స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. రాజ్ కరణ్ స్నేహితులతో కలిసి జమీల్‌పై దాడి చేశాడు. ఆపే ప్రయత్నం చేస్తున్న తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. గాంధీ దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 17న మరణించింది. రజిని మృతికి కారణమైన రాజకరణ్, కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా... వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.