calender_icon.png 6 December, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలపై అవగాహన ఉండాలి

06-12-2025 10:06:47 PM

జిల్లా ఎస్పీ డి.జానకి 

భూత్పూర్: మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్, తాటికొండ గ్రామాల్లో ప్రజలతో సమావేశమై గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో శాంతి భద్రత, చట్టపరమైన నియమాలు, ప్రతి పౌరుడి బాధ్యతలపై జిల్లా ఎస్పీ  డి. జానకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు, మహిళలు, యువత, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రచార కార్యకర్తలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎవరి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.

మద్యం పంపిణీ, డబ్బు ఇవ్వడం, అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు, గుంపులుగా తిరగడం, సోషల్ మీడియాలో పుకార్లు రెచ్చగొట్టే పోస్ట్ లాంటివి చట్టపరమైన నేరాలు అని గుర్తుచేశారు. యువత రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు నమ్మి ఆందోళనలకు దిగకూడదని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పహారా బృందాలు, షీ టీమ్ సేవలు సిద్ధంగా ఉన్నాయని, ఏవైనా వేధింపులు జరిగినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. అభ్యర్థులు మరియు ప్రచార కార్యకర్తలు అనుమతుల్లో పేర్కొన్నట్లే ప్రచారం నిర్వహించాలి.

ఓటర్లపై ఒత్తిడి చేయడం, బెదిరించడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కేసులు, బైండ్ ఓవర్లు, క్రిమినల్ చర్యలు, అభ్యర్థిత్వ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ శాంతియుతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, భూత్పూర్ ఎంపీడీవో, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.