21-01-2026 12:00:00 AM
మైక్రో-ఫైనాన్స్ సంస్థలు అనేవి వ్యక్తులకు, చిన్న తరహా సంస్థలకు, మహిళా స్వయం సహాయక బృందాలు, పేద రైతులు నడిపే సంస్థలతో సహా, చిన్న రుణాలను అందించే సంస్థలు. వీటిలో నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సిలు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బి) ఎక్కువగా రుణాలు ఇస్తుంటాయి. మహిళల సాధికారత కోసం, ఇప్పటివరకు బ్యాంకు రుణాలకు దూరంగా ఉన్న పేద ప్రజలను ఆర్థిక వ్యవస్థలో చేర్చడం కోసం మైక్రో ఫైనా న్స్ రుణాలను ఇస్తూ ప్రోత్సహించడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి భూమి లేదా ఏదైనా ఇతర ఆస్తిని పూచీకత్తుగా కోరితే, సూక్ష్మరుణ సంస్థలు మాత్రం ఎలాంటి పూచీకత్తు లేకుండా, చాలా తక్కువ పత్రాలతో చిన్న రుణాలను మంజూరు చేయడంలో సహాయపడుతుంది.
అయితే ఇటీవలి సంవత్సరాల్లో సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ) అందించే రుణాల్లో వేగవంతమైన పెరుగుదల కనిపించింది. రుణగ్రహీతల్లో సుమారు 85 శాతం మంది మహిళలే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా మైక్రోఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే వడ్డీ రేట్లపై ఉన్న గరిష్ట పరిమితిని తొలగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి 2022లో తీసుకున్న నిర్ణయం తర్వాతే, ఈ సంస్థల రుణాల పంపిణీలో వేగవంతమైన వృద్ధి చోటుచేసుకోవడం విశేషం. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు 22 శాతం నుంచి 24 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఒక మహిళ రూ. లక్ష రుణంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించిందని, దానిని 24 శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉందని అనుకుందాం.
వడ్డీతో సహా రుణాన్ని తిరిగి చెల్లించి, తన వ్యాపారాన్ని కొనసాగించాలంటే, ఆమె ప్రతి సంవత్సరం రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ లాభం సంపాదించాల్సి ఉంటుంది. ఏ చిన్న వ్యాపారానికైనా ఇంత అధిక లాభాన్ని సంపాదించడం చాలా కష్టతరం. వాణిజ్య బ్యాంకులు అతిపెద్ద పెట్టుబడిదారీ కంపెనీలకు సాధ్యమైనంత తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తాయి. దీనికి విరుద్ధంగా, సూక్ష్మ-విత్త సంస్థలు మాత్రం చిన్న తరహా వ్యాపారాలకు విపరీతంగా అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తాయి. విపరీతంగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేయడమనేది రుణ వ్యాపారం లాభదాయకతను నిర్ధారించడం కోసమే. రుణగ్రహీతల్లో చాలా మంది పూర్తి మొ త్తాన్ని తిరిగి చెల్లించలేకపోయినప్పటికీ, వసూలు చేసే అధిక వడ్డీ కారణంగా డబ్బు అప్పు ఇచ్చే సంస్థ లాభంతో ముగుస్తుంది. ఇటీవల మహిళా రుణ గ్రహీతలపై నిర్వహించిన సర్వేలో 60 శాతం కంటే ఎక్కువ మంది రెండు కంటే ఎక్కువ మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారని తేలింది.
పాత రుణాలను తిరిగి చెల్లించడానికి వారు కొత్త రుణాలు తీసుకోవలసి వచ్చింది, తద్వారా రుణాల ఉచ్చులో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా రుణగ్రహీతలపై రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు, దుర్భాషలు, శారీరక లేదా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు నెలవారీ వాయిదా చెల్లించనప్పుడు, రికవరీ ఏజెంట్లు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడడంతో పాటు ఆయా రుణగ్రహీతల బంధువులు, స్నేహితుల ముందు వారిని అవమానించడం, కుటుంబ సభ్యులను వేధించడం, సోషల్ మీడియా నుంచి దొంగిలించిన ఫోటోలను అసభ్య రీతిలో ఉపయోగించడం వంటి వివిధ పద్ధతులను ఆవలంబిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారు. మైక్రో-ఫైనాన్స్ రుణాలు పేద ప్రజల నుండి కష్టపడి సంపాదించిన డబ్బును రాబట్టి వారిని అప్పుల్లోకి నెట్టే వ్యవస్థగా మారింది. అందుకే మైక్రోఫైనాన్స్ రుణాలతో జాగ్రత్తగా ఉండడం మేలు.
ఆళవందార్ వేణు మాధవ్, 8686051752