calender_icon.png 27 January, 2026 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీలో 'అవినీతి' ఒకరిపై వేటు

27-01-2026 08:04:24 PM

టీఏ సస్పెన్షన్, రూ. 5.45 లక్షల రికవరీ!

​క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం... డిఆర్డిఓ దత్తారావు

బెజ్జూర్,(విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డి ఆర్ డి ఓ) దత్తారావు స్పష్టం చేశారు. మంగళవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక లో ఆయన పాల్గొని, అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై కొరడా ఝుళిపించారు.

​పని చేయకుండానే పేమెంట్లు.. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం!

​మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7.25 కోట్ల వ్యయంతో చేపట్టిన 828 పనులపై ఎస్ఆర్పీ రవి నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.​ ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసే క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ చర్యలు ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు.

​కృష్ణపల్లి టీఏపై వేటు:

కృష్ణపల్లి గ్రామంలో టెక్నికల్ అసిస్టెంట్ (TA) రవీందర్ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ అయింది. గ్రామంలో నాటిన 1720 మొక్కలలో కేవలం 50 మాత్రమే బ్రతికి ఉన్నాయి. పనులు చేయకుండానే కూలీలకు చెల్లింపులు చేసినట్లు రుజువు కావడంతో, రవీందర్ నుండి రూ. 3 లక్షలు రికవరీ చేయడంతో పాటు అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు డి ఆర్ డి ఓ ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన 'మేటి'ని కూడా విధుల నుంచి తొలగించారు.

​ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ:

భారేగూడెం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణ 13 మంది కూలీలకు పని చేయకుండానే డబ్బులు చెల్లించినట్లు తేలడంతో, అతనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

​మొత్తం రికవరీ రూ. 5.45 లక్షలు!

​ఈ ప్రజావేదిక ద్వారా బెజ్జూర్ మండల వ్యాప్తంగా మొత్తం రూ. 4,83,211 నిధుల రికవరీ చేయడంతో పాటు, అక్రమాలకు బాధ్యులైన వారిపై రూ. 62,000 పెనాల్టీ విధించారు. వెరసి మొత్తం రూ. 5.45 లక్షల మేర రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ​ఈ కార్యక్రమంలో అబోర్డ్స్ మెన్ పర్సన్ పి.వి.ఎన్. సాయి శ్రీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రెసిడెంట్ కె. ఆంజనేయులు, ఎంపీడీవో బి.ఎస్. ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజన్న, ఎస్ఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు.