27-01-2026 07:42:35 PM
- మెదక్ జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు
మెదక్,(విజయక్రాంతి): హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.10,000 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు తెలిపారు. ఎస్పీ పూర్తి వివరాలు వెల్లడిస్తూ బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ మాంజి జీవనోపాధి కోసం ముపిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చి, గ్రామ శివారులో ఉన్న వీవీఎం ఆగ్రో కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన రెండవ తమ్ముడు ధనుంజయ్ కూడా అదే కంపెనీలో వెల్డర్‌గా చేరాడు. కొద్ది రోజుల తర్వాత మూడవ తమ్ముడు సర్వన్ కుమార్ వచ్చి రూమ్‌లో ఉంటున్నాడు.
20.04.2024 తేదీ రాత్రి సమయంలో వారి బంధువులైన సంజయ్, ఓం ప్రకాష్ రాయ్‌లతో కలిసి సర్వన్ కుమార్ కిరాణా సరుకులు తీసుకురావడానికి వెళ్లారు. కొద్దిసేపటికి సంజయ్ మాత్రమే రూమ్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం సర్వన్ కుమార్ ను వెతకడానికి వెళ్లగా వీవీఎం ఆగ్రో కంపెనీ సమీపంలో సర్వన్ కుమార్ తలపై ఓం ప్రకాష్ రాయ్ మోదీతో కొట్టి హత్య చేసి, పారిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేయగా, అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కృష్ణ సమగ్ర దర్యాప్తు నిర్వహించి, కీలక సాక్ష్యాధారాలను సేకరించారు.
పూర్తి సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు ఓం ప్రకాష్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాస్క్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించగా, లైసనింగ్ ఆఫీసర్ విటల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి కేసు విచారణలో సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.