calender_icon.png 27 January, 2026 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ల వివాదం!

21-01-2026 12:00:00 AM

భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఎలాంటి హక్కులను (కొన్ని మినహాయింపు) కల్పించిందో అవే హక్కులు గవర్నర్లకు ఉంటాయి. అందులో భాగంగా ప్రతీ ఏడాది ఆయా రాష్ట్రాల తొలి శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్లు సభనుద్దేశించి ప్రసంగించడం ఆనవా యితీ. తాజాగా మంగళవారం ఏకకాలంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఆయా రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తమిళనాడులో జాతీయగీతం అంశం గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చిచ్చురేపగా.. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలోని కొన్ని అంశాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చదవకపోవడం విమర్శలకు దారి తీసింది. ఈ రెండింటికి వ్యత్యాసమున్నప్పటికీ వివాదాలకు కేంద్ర బిందువు మాత్రం గవర్నర్లే. ‘నా ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం. జాతీయగీతానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారు.’ అంటూ రవీంద్ర నారాయణ్ రవి 

(ఆర్‌ఎన్ రవి) అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే లోక్‌భవన్.. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయ గీతాన్ని పాడాకుండా అవమానించిందంటూ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండడంతో గవర్నర్ దానిని చదవడానికి నిరాకరించారని తెలిపింది. మరోవైపు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడాన్ని సభా సంప్రదాయాన్ని ఉల్లఘించినట్లవుతుందని స్టాలిన్ సర్కార్ స్పష్టం చేసింది. గత మూడేళ్లుగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య జాతీయగీతం ప్రొటోకాల్, ప్రసంగంపై వివాదాలు కొనసా గుతూనే ఉన్నాయి. గతేడాది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన ప్రసంగం కాకుండా ఆర్‌ఎన్ రవి తన సొంత ప్రసంగాన్ని చదివి వినిపించడం చర్చనీయాంశమైంది. తమిళనాడుకు ఆర్‌ఎన్ రవి గవర్నర్‌గా వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో పొసగడం లేదు. 

ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉండడం ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. మరోవైపు కేరళలోని పినరయి ప్రభుత్వం ఇచ్చిన కాపీ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పేర్కొన్న అంశాలను చదవడానికి రాజేంద్ర అర్లేకర్ నిరాకరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో లోపాలున్నా గవర్నర్లు కచ్చితంగా చదవాల్సిదే. కానీ గవర్నర్లు మాత్రం తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఇటీవలే బాగా పెరిగిపోయాయి. బీజేపీ అధికారంలో లేని తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ. గతంలో కేరళ గవర్నర్‌గా పనిచేసిన ఆరిఫ్ మహమ్మద్ యూనివర్సిటీల వైస్‌చాన్సలర్లను మూకుమ్మడిగా తొలగించడం సీఎం విజయన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇక మాజీ ఉపరా

ష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బెంగాల్‌కు గవర్నర్‌గా పనిచేసిన సమయంలో మమతా బెనర్జీ సర్కారుతో ప్రచ్చన్న యుద్ధమే కొనసాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులను, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను గవర్నర్లుగా నియమించి రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.