21-01-2026 12:00:00 AM
సర్వం చావేక్షితం ద్రవ్యం నిబద్ధాగమ నిర్గమమ్ నిర్గఛ్ఛేదభిగఛ్ఛేద్వా ముద్రాసంక్రాంత భూమికమ్! (కౌటిలీయం
ప్రతి వస్తువు అంత:పురంలోనికి వచ్చినా, వెళ్లినా పుస్తకంలో రాసుకొని, ఆ వస్తువు ఉన్న పెట్టెకు ముద్ర ను వేసి లోనికి గాని బైటకు గాని పంపాలి, అంటాడు ఆచార్య చాణక్య. ముద్రాసంక్రాంత భూమికమ్.. అంటే ముద్రను వేసిన పిమ్మటనే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులు పంపబడాలి. ఈనాడు ప్రభుత్వ, కార్పోరేట్ కార్యాలయాల్లో ఈ పద్ధతి ఆచరణలో ఉన్నది. వ్యక్తులు కార్యాలయాల లోనికి వెళ్లినా, కార్యాలయం నుంచి బైటకు వచ్చినా.. సమయంతో సహా రిజిస్టర్ (పట్టిక)లో రాసుకొని పంపడం జరుగుతుంది. ఇది కార్యాలయాల్లో నిర్ణీత నిరంతర ప్రక్రియ.
దానితో నియంత్రణ సులువవుతుంది. అలా రిజిస్టర్ పెట్టకపోవడం బాధ్యతా రాహిత్యంగా భావించి సంబంధిత అధికారిపై విచారణ జరిపిస్తారు. కార్యాలయంలో వస్తువుల కోసం మూవ్‌మెంట్ రిజిస్టర్ పెట్టడం వల్ల; జవాబుదారీతనం, నియంత్రణ, సమర్థతను పెంచడం సులువవుతుంది. ఏ వస్తువు ఎటువైపు వెళుతున్నదీ నియంత్రణ చేయడం ద్వారా స్పష్టమైన భద్రతా విధానాన్ని అందించడం, నష్టాలను లేదా దొంగతనాలను నివారించడం సులువవుతుంది.
దీనివల్ల భౌతిక నిలువలను రికార్డులతో సమన్వయం చేయడం జరుగుతుంది. ఆర్థిక నియంత్రణలో సహాయకారిగా నిలుస్తుంది. ముఖ్యంగా వనరులు ఎక్కడున్నాయో , ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం, కార్యకలాపాలను సజావుగా నడపడం జరుగుతుంది. ఇది అవసరమా అంటే.. అవస రం కాదంటే కాదు.. ఒక ఎలక్ట్రాన్‌ను అది పార్టికల్‌లా(Particle) లేక తరంగమా (Wave) అంటే చూచే దృష్టికోణాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తి చక్కెరను తిన్నా డనుకుందాము.. దాని రుచి ఎలా ఉందం టే.. తియ్యగా ఉన్నదని చెపుతాడు. అయితే అది చక్కెర ధర్మమా లేక తిన్న వ్యక్తి ధర్మమా అంటే విడివిడిగా అది దేని ధర్మమూ కాదు. చక్కెరతో వ్యక్తి అనుసంధానమైనప్పుడు ఆ ప్రక్రియలో తీయదనమనే అనుభవాన్ని పొందుతున్నాడు.
బాధ్యతల అప్పగింత..
జాతి పురోగతికి ఆర్థిక అభివృద్ధి, బలమైన రక్షణ రెండూ అవసరం. సాంకేతిక దార్శనికత వల్ల ఆర్థిక ప్రగతి.. స్వయం సమృద్ధిని సాధించిన బలమైన సైనిక వ్యవస్థ వల్ల రక్షణ కలుగుతుంది. బలం బలాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. వ్యక్తిలోని బలహీ నతలు బలాలుగా, సాధించే శక్తిగా మారే వరకు ఆశయాలను చల్లారనీయవద్దు, అం టారు. వస్తువుల రవాణానే కాదు.. వ్యక్తుల పదవుల ఉన్నతీకరణ.. ఉన్నతస్థాయి బాధ్యతలను అప్పగించడం కూడా నిర్ణీత ప్రక్రియ ఆధారంగానే జరగాలి. మాజీ రాష్టపతి అబ్దుల్ కలామ్ గారిని ఇస్రో నుంచి డీఆర్డీవోలోకి డైరెక్టర్‌గా తీసుకోవడం కూడా ఎ న్నో సమావేశాలు చర్చల పిదపనే జరిగింది. ఎలాగైతే కార్యాలయాల్లో వస్తు రాకపోకలను నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామో, అలాగే వ్యక్తి తనలోని ఆలోచనలను నియంత్రించుకోవాలి. అనవసరమైన ఆలోచనలు ఊహాపోహలకు దారితీస్తాయి.
తప్పుడు ఆలోచనలు పరిస్థితులను నిం దించేందుకు, రంధ్రాన్వేషణలకు దారితీస్తా యే గాని యదార్ధాన్ని పరిశీలించేందుకు ఉపకరించవు. పరిస్థితులను మదింపు చేసేందుకూ ఉపకరించవవి. సహేతుకమైన సదా లోచనలు అనంతమైన అంతర్గత సృజనాత్మక శక్తియుక్తులను వెలికి తీసుకునేందుకు ఉపకరిస్తాయి.
ప్రేరణాత్మక జాబితా..
జ్ఞానం వినియోగించుకునేది, సంపద ప్రోదిచేసుకునేది.. జీవితానికి రెండూ అవసరమే. కాకపోతే దేనిని ఎంత వాడాలి.. ఎలా వాడాలి అనే విచక్షణ అవసరం. అవసరం లేనిచోట జ్ఞానాన్ని వాడినా, అవసరానికి వాడకుండా సంపదను ప్రోదిచేసుకున్నా అవి జీవితాన్ని బాధామయం చేస్తాయి. ఒక భిక్షుకుడు వరుసగా 14 రోజులు ఆహారం తీసుకోకుండా మరణించాడట. బాధాకరమైన విషయం ఏమిటంటే.. అతని సంచీలో దాదాపు లక్షా 40వేల రూపాయలు ఉన్నాయని ఆమధ్య పేపర్లో చదివాము. చాలా మందికి తామెక్కడ ఉన్నారో తెలియదు. ఎక్కడికి వెళ్లాలో స్పష్టతా ఉండదు. ఎక్కడ ఉన్నామో ఎక్కడికి వెళ్లాలో తెలిస్తేనే.. ఎలా వెళ్లాలో ఆలోచిస్తాము.
ఎవరైతే విజయాన్ని సాధించాలని భావిస్తారో అలాంటి వారికి నాలుగు ముఖ్యమైన లక్షణాలు అవసరం. ఉదాత్తమైన ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. సకారాత్మక ఆలోచనలతో దానిని బలోపేతం చేయడం, స్పష్టంగా దానిని దర్శించడం, సాధించగలననే బలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగిఉండడం, అన్నింటికన్నా ముఖ్యంగా దానిని సాధించాక ఏమిటి అనే ఆలోచన చేయడం. ముఖ్యమైన బాధ్యతలను అప్పగించే సమయంలో నాయకుడు అనుచరులను తన బృందంలోకి తీసుకునేప్పుడే జాగ్రత్తగా ఆలోచించాలి. సభ్యుల సామర్ధ్యాన్ని నిశితంగా పరిశీలించాలి.
ఎవరెవరు ఏయే కార్యాల్లో సమర్ధవంతంగా పనిచే యగలరో అంచనా వేయాలి. దానినే ‘ప్రేరణాత్మక జాబితా’ (Motivational Inven tory)గా చెప్పుకోవచ్చు. ‘ప్రేరణాత్మక జాబి తా’ మూడు ముఖ్యమైన అవగాహనలపై ఆధారపడి నిర్మాణం కావాలి. ఉద్యోగులు తమ బాధ్యతా నిర్వహణలో సంతృప్తి చెం దాలంటే ఏయే అవసరాలు ఉంటాయో నాయకునికి అవగాహన కుదరాలి. అప్పగించే బాధ్యత ఉద్యోగిపై ఎలాంటి ప్రేరణా త్మక ప్రభావం చూపుతుందో అవగాహన కుదరాలి. అప్పగించిన బాధ్యత ఉద్యోగి ప్రవర్తనను సకారాత్మకంగా బలోపేతం చేస్తున్నదా అనే అంశంపై అవగాహన కుదరాలి.
అంకితభావం అవసరం..
ఉత్తమశ్రేణి నాయకుడు.. ఉద్యోగి అవసరాలను సంతృప్తిపరచే పని, వాతావరణ పరిస్థితులను గుర్తించాలి. అప్పగించిన బాధ్యత ఉద్యోగికి గుర్తింపును, ఎదుగుదలను, అవసరాలను తీర్చుకునే ఉపకర ణం గా ఉంటేనే.. ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తాడు. ఆశించిన ఫలితాలు ఆవిష్కృ తమౌతాయి. చేసే పనిలో సంతృప్తి చెందిన ఉద్యోగి పరిసరాలపైనా, పరిస్థితులపైనా దృష్టిని కేంద్రీకరిస్తాడు.
యాజమాన్య విధానాలు, నాయకుని సమర్ధతను, భద్రత, స మాజంలో గౌరవం.. ఇలాంటి పలు అంశాలపై దృష్టిపెట్టి అన్ని విధాలుగా తనకు ఆమోదయోగ్యమైతే అంకి త భావంతో పనిచేస్తాడు.. ఆశించిన దానికన్నా అత్యంత ప్రామాణికమైన, సమర్ధవం తమైన ఫలితాలను అందిస్తాడు. ఇలాంటి వ్యక్తుల్లో సృజనాత్మకత, స్వీయ సంతృప్తి వెలుగుచూస్తూ, పనిలో ఆనందాన్ని పొందే వీరిలో బాహ్య ప్రేరణకన్నా అంతర్గత ప్రేరణయే బలంగా పనిచేస్తుంది.
కార్యాలయా ల్లో జరిగే ప్రతి చర్యను నమోదు చేస్తూ అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేయడం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. ఉద్యోగుల సాంకేతిక విజ్ఞానం పెరిగే చర్యలు చేపట్టడం వల్ల వారి పనితనం మెరుగుపడుతుంది. వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, పని వాతావరణాన్ని ఉన్నతీకరించడం వల్ల వారిలో అంతర్గత ప్రేరణ కలిగి పనిలో ఆనందాన్ని అనుభవిస్తారు. అద్భుతాలను సృష్టిస్తారు.
వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి