06-08-2025 01:02:53 AM
కన్నాయిగూడెం,ఆగస్టు5(విజయక్రాంతి):వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయాత్తం కావాలని రాష్ట్ర రెవె న్యూ (విపత్తు నిర్వహణ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఏటూరునాగారం ఐటిడిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా,ఏఎస్పి శివం ఉపాధ్యాయ,అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి లతో కలిసి వర్షాకాలంలో వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళిక ల్లో భాగంగా వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం,ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామంలో ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజ్ ను రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రాతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సంద ర్భంగా స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ గతం లో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ,నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని, సకాలంలో స్పందించకపోతే చిన్న సమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందని అరవింద్ కుమార్ అధికారులను హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
జిల్లాలో ఎన్డిఆర్‌ఎఫ్,జిల్లా అగ్నిమాపక శాఖ బృందాలు భారీ వర్షాల వల్ల నష్టం జరగకుండా ముంపు నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.
పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు.జిల్లా ఆధికారులతో వాట్స్‌అప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. సీజన్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.