calender_icon.png 6 August, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవి వద్దకు సినీకార్మికుల పంచాయితీ

06-08-2025 01:05:16 AM

- రెండోరోజూ కొనసాగిన సమ్మె  

- నేడు ఫిల్మ్ ఫెడరేషన్‌తో చర్చించనున్న మెగాస్టార్ 

సినిమా ప్రతినిధి, ఆగస్టు 5 (విజయక్రాంతి): ‘థర్టీ పర్సెంట్’ సస్పెన్స్ రెండో రోజూ కొనసాగింది. సినీకార్మికుల సమ్మె కారణంగా షూటింగులన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు దాదాపు 30 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అగ్ర నటుడు చిరంజీవి రావిపూడి సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సినీసమ్మెతో ఆగిపోయింది. చివరి దశలో ఉన్న బాలకృష్ణ ‘అఖండ2’ షూటింగూ ఆగిపోయింది.

డిసెంబర్‌లో విడుదల లక్ష్యంతో ఉన్న ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపైనా సమ్మె ప్రభావం పడింది. రాజమండ్రిలో రామ్ పోతినేని సినిమా చిత్రీకరణ నిలిపివేయడం అనివార్యమైంది. సోమవారం ప్రారంభించాలనుకున్న అల్లరి నరేశ్ కొత్త సినిమాకు సమ్మె రూపంలో ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఈ వారం పట్టాలెక్కాల్సిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారు. ఇంకా నాని ‘ది ప్యారడైజ్’, సాయిదుర్గాతేజ్ ‘సంబరాల యేటిగట్టు’, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, అడివి శేష్ ‘డకాయిట్’, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాల షూటింగులు ఆగిపో యాయి. ఇవే కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లూ స్తంభించిపోయాయి.  

చిరంజీవికి మా నిర్ణయాలు తెలిపాం  

 చిరంజీవి నివాసంలో సమావేశం అనంతరం నిర్మాత సీ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘మేము చిరంజీవిని కలిసి మా సమస్యలను వివరించాం.  షూటింగ్‌లను అకస్మాత్తుగా ఆపడం సరైనది కాదని మేము చిరంజీవితో చెప్పాం. ఆయన మా వైపు సమస్యలను విన్నారు. కార్మికుల వెర్షన్‌ను కూడా తెలుసుకొని, బుధవారం స్పష్టమైన నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని చెప్పారు’ అని తెలిపారు.  

రెండోరోజు..

- తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాల నేతలు వేతనాల పెంపు విషయమై రెండోరోజూ చర్చలకు ప్రయ త్నించారు. కార్మికులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న కార్మికశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. కార్మికులు, నిర్మాతలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించారు.  

- ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ షూటింగులకు అంతరాయం కలిగించటం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డట్టు సమాచారం. కార్మికులు తమతో కలిసివస్తారని ఆశిస్తున్నామని నిర్మాత ప్రసన్నకుమార్ మీడియాతో ఆశాభావం వ్యక్తం చేశారు.

- ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ‘గిల్డ్’ సభ్యులైన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ, మైత్రి మేకర్స్ రవికుమార్‌తోపాటు నిర్మాత సీ కల్యాణ్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, కేఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

- తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 2022లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత, మూడేళ్ల వ్యవధిలో 30 శాతం వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఈ పెంపును అంగీకరించడానికి సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు.. యూనియన్లతో సంబం ధం లేని కార్మికులను నియమించుకునేందుకు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ద్వారా ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అయితే, దీనికి భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో ఈ వెబ్‌సైట్ క్రాష్ అయిందని సమాచారం.