21-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కే మూర్తి
ముషీరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె మూర్తి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత సైబర్ నేరాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై మంగళవారం దోమలగూడలోని ఏవి కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ అలవాటు అయితే యువత తమ బంగారు భవిష్యత్ ను కోల్పోతారని అన్నారు. సైబర్ నేరాలకు బలవుతున్నారని, ముఖ్యంగా యువతే అని పేర్కొన్నారు.
బెట్టింగ్, ఆన్లైన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తక్కువ కాలంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆశలకు యువత దూరం గా ఉండాలన్నారు. యువత కష్ట పడి చదవి దేశానికి రాష్ట్రానికి కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆమె సూచించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడిపి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని, తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు. ఎవరైనా నిబందనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ ఆడిషనల్ డీసీపీ జోగు ల నర్సయ్య, దోమలగూడ సిఐ అంజద్ అలీ, ఎస్‌ఐ లు శ్రీనివాస్ రెడ్డి, విజ య, శ్రీకాంత్, వెంకటేశ్వర్, ఏఎస్‌ఐ డేవిడ్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.