04-07-2025 01:00:19 AM
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, జూలై 3: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రత ఉంచడంతో పాటు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఏవో, తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ ఏడితో, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రుణమాఫీ, రైతు భరోసా గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయ్యింది..? కాని వారు ఎందరు..? అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేసే విత్తనాలను రైతులకు చేరవేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
భూ భారతి అవగాహన సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టాలని, మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారికి రెండవ విడతలో మంజూరు చేయాలని ఎంపీడీవోలకుసూచించారు.