సీఎం మాట బేఖాతర్!
కాళేశ్వరంలో పనిచేసిన అధికారికే కీలక బాధ్యత
దర్యాప్తు పరిశీలన కమిటీకి కన్వీనర్‌గా సీఈ సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాష్ట్ర నీటిపారుదల శాఖలో ముఖ్యమంత్రి ఆదేశాలు, నిర్ణయాలు అమలుకావటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల వైఫల్యానికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా అక్కడే పనిచేస్తున్న అధికారులు, ఇంజినీర్లను ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలి సమీక్షలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలను నీటిపారుదల శాఖ అధికారులు బేఖాతర్ చేస్తున్నారు.
నలుగురు సభ్యుల కమిటీలో ఆ అధికారి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు వర్షాకాలం ప్రారంభమ య్యేలోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచించిన ప్రకారం మరమ్మతు పనులు చేపట్టాలని, తదనంతర అధ్యయనం/విచారణ కోసం నలుగరు సభ్యులతో నీటిపారుదల శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) అనిల్‌కుమార్, సభ్యులుగా ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఓ అండ్ ఎం, సీసీ) నాగేందర్‌రావు, చీఫ్ ఇంజినీర్ (సీడీవో) మోహన్‌కుమార్‌ను, రామగుండం చీఫ్ ఇంజినీర్ కే సుధాకర్ రెడ్డిని సభ్యకన్వీనర్‌గా నియమించింది.
అవసరమైతే చైర్మన్ ఆహ్వానం మేరకు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ను నియమించుకోవచ్చని ఈ నెల 18న నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీ సభ్య కన్వీనర్ కే సుధాకర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి నుంచి కీలక అధికారిగా ఉన్నారు. కాళేశ్వరం టెండర్ల ప్రక్రియలో భాగంగా ఎస్టిమేట్ల తయారీ నుంచి బరాజ్‌లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణం వరకు ఆయన సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్‌ఈ)గా పని చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అనుపానులు ఆయనకు తెలుసని నీటి పారుదల శాఖలో ఏ అధికారిని, ఇంజినీర్‌ను అడిగినా చెప్పేస్తారు. సుధాకర్‌రెడ్డి ఎస్‌ఈగా మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి కాంట్రాక్టర్‌కు ‘సబ్‌స్టాన్షియల్ కంప్లిషన్ సర్టిఫికెట్’ కూడా ఇచ్చారు. సబ్‌స్టాన్షియల్ కంప్లిషన్ సర్టిఫికెట్ అంటే.. ఒక పని పాక్షికంగా పూర్తి అయ్యిందని కాంట్రాక్టర్‌కు జారీచేసే కీలక ధృవీకరణ పత్రం.
సీఎం పర్యటనలో నిజాలు బట్టబయలు
సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటనలో ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫిబ్రవరి 13న నీటి పారుదల శాఖ అధికారులతోపాటు అప్పటి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్త్రన్ ఈ ప్రజెంటేషన్ ఇ చ్చారు. ఈ సందర్భంగా పనులు చేయకున్నా చేసినట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చారని వెల్లడించడం గమనార్హం. పైగా సబ్ స్టాన్షియల్ కంప్లిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పు అని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఎత్తిచూపారు. కాళేశ్వరం అవినీతిపై చర్యల్లో భాగంగా అక్కడ సీఈగా పనిచేస్తున్న నల్లా వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేసి అప్పటికి ఎస్‌ఈ అయిన సుధాకర్‌రెడ్డిని సీఈగా నియమించారు.
ఒకవైపు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తూ.. ఆ ప్రాజెక్టులో కీలక అధికారిగా పనిచేసిన ఇంజినీర్‌ను ఇప్పుడు విచారణ కమిటీలో సభ్య కన్వీనర్‌గా నియ మించడంపై నీటిపారుదల శాఖలో తీవ్ర చర్చ జరుగుతున్నది. కాళేశ్వరంలో భాగస్వాములైన వారందరినీ ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా సూచించినప్పటికీ.. నీటిపారుదలశాఖలో అందుకు పూర్తి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొంటుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది.






