మేడ్చల్ మండలంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు
- ఉదయం నుంచి రాత్రి వరకు విచ్చలవిడిగా అమ్మకాలు
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
మేడ్చల్ అర్బన్, జూన్ 22(విజయ క్రాంతి): మేడ్చల్ మండలంలోని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటికీ మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామాల్లోని కిరాణా షాపులు, చిన్న హోటళ్లు, ఇళ్లల్లో సైతం బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతు న్నాయి.
ఉదయం నుంచే మందుబాబులు గుమిగూడటంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల రాత్రి 11 గంటల దాకా విక్రయాలు సాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎమ్మార్పీ కంటే 20-50 అధికంగా వసూలు చేస్తున్నారు.అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే అనుమానం కలుగుతోంది అని ఓ గ్రామస్తుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.బెల్ట్ షాపుల కారణంగా గ్రామాల్లో గొడవలు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. యువత మద్యానికి బానిసలవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల సమీపంలో కూడా విక్రయాలు జరగడం గమనార్హం.
బెల్ట్ షాప్ లో జోరుగా వ్యాపారం
మండలంలో గ్రామాలలో బెల్ట్ షాపులు లేవు. పెద్ద గ్రామాలలో మాత్రమే ఉన్నాయి. దీంతో ఇతర గ్రామాల బెల్ట్ షాపులు గల్లీకి ఒకటి వెలిశాయి. మద్యం దుకాణానికి వెళ్లడానికి దూరం అవుతుందని ఉద్దేశంతో స్థానికంగా ఉన్న బెల్టు షాపులలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో బెల్ట్ షా పులలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.
మహిళల ఆగ్రహం
బెల్ట్ షాపుల నిర్వహణ పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే గ్రామాల్లో మద్యం దుకాణం ఉంటే అక్కడి వరకు వెళ్లి కొనుగోలు చేయలేరని, స్థానికంగా మద్యం దొరకడం వల్ల ఎక్కువగా తాగుతున్నారని అంటున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని మేడ్చల్ మండల ప్రజలు కోరుతున్నారు.






