ప్రభుత్వ భూమి కబ్జా
- రూ.కోట్ల విలువ చేసే భూమి దర్జాగా కబ్జా
- ప్రభుత్వ బోర్డులు తొలగించి నిర్మాణాలు
- రెవెన్యూ అధికారుల నామమాత్రపు చర్యల వల్లే భూ కబ్జాలు
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 22: కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. గతంలో ఆ భూమి ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డు ఉన్నప్పటికీ ఆ బోర్డును తొలగించి.. రాత్రికి రాత్రే అక్కడ బోరు వేసి నిర్మాణాలు చేపట్టానికి ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో.. అధికారులు వచ్చి అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు. మరలా కొన్నాళ్లు నిర్మాణ పనులు ఆపి.. మళ్లీ మొదలుపెట్టారు.
అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని మునగనూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 44లో 400 గజాల ప్రభుత్వ స్థలం ఉండగా.. అందులో 200 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు తీశారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 1.5 కోట్లు ఉంటుందని అంచనా. గతంలో అందులో రాత్రికి రాత్రే బోరు వేసి నిర్మాణాలను చేపట్టడానికి ప్రయత్నింస్తుంటే.. కాలనీ వాసులు అడ్డుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో అధికారులు ఘటన స్థలానికి వచ్చి..
అప్పటి వరకు నామ మాత్రపు చర్యలు తీసుకుని బోరు వేస్తున్న వాహనాన్ని సీజ్ చేసి.. చేతులు దులుపుకున్నారు. మరల ఆ భూమిలో నిర్మాణాలను చేపట్టడాన్ని గమనించిన కాలనీవాసులు, గ్రామస్తులు రెవెన్యూ అధికారులుకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే సర్వే నెంబర్‌లో కొంత మంది భూ కబ్జాదారులు కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి..
అందులో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయించారు. కానీ ప్రస్తుతం ఆ బోర్డును తొలగించి దర్జాగా కబ్జాలు చేసి.. అందులో నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదు. మరి కొంత మంది కబ్జాలు చేసి.. చుట్టూ కడీలు నాటి పెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న వారిపై కూడా ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. భూకబ్జాలపై ఫిర్యాదులు చేస్తే..
రెవెన్యూ అధికారులు మాత్రం భూకబ్జాదారుల కొమ్ముకాస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ కబ్జాదారులు ఇచ్చే తాయీలాలు తీసుకుని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులకు ధారదత్తం చేస్తున్నారని స్థానికులు విమర్శించారు. భూ కబ్జాపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను రెవెన్యూ కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.






