23 June, 2026 | 1:53 AM

ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు

23-06-2026 12:47 AM
  1. రోజురోజుకు ధరలు పైపైకి 
  2. సామాన్య ప్రజల ఉక్కిరిబిక్కిరి 

కరీంనగర్, జూన్ 22 (విజయ క్రాంతి): కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలోని కూరగాయ లు ధరలు పైపైకి వెళ్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కిలో చొప్పున కొనుగోలు చేసిన కూరగాయాలను ప్రస్తుతం అర కిలో కొనడానికి ప్రజలు నిరాసక్తి కనబరుస్తున్నారు.

దీంతో విక్రయదా రులకు సైతం గిరాకీలు లేక నిరాశలో ఉంటున్నారు. జిల్లాలో కిలో కూరగాయలు కొనా లంటే యాభై నుంచి వంద రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి నుంచి పాలకూర వరకు, ఉల్లిపాయల నుం చి ఎల్లిపాయల వరకు ఇలా ఏ కూరగాయలు కొనాలన్నా జేబులు గుల్లా చేసుకో వాల్సిందే. మొన్నటి వరకు కిలో టమాట రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60కి పెరిగింది.

చింతపం డు పాత ధర రూ.90, కొత్త ధర రూ.120, క్యాప్సికం(దొడ్డుమిర్చి) పాతది రూ.60, కొత్త ధర రూ.80, బీరకాయ పాతది రూ. 60, కొత్త ధర రూ.80, క్యారెట్ పాతది రూ. 60, కొత్త ధర రూ.80, దొండకాయ పాతది రూ.40 ఉండగా కొత్త ధర రూ. 60, వెల్లుల్లి పాతది రూ.90, కొత్త ధర రూ.120, ఉల్లిగడ్డ పాత ధర రూ.30, కొత్తది రూ.40, ఆలుగడ్డ పాతది రూ.30, కొత్త ధర రూ.40, చిక్కుడు పాత ధర రూ.80, కొత్త ధర రూ. 100లు, పచ్చిమిర్చి పాత ధర రూ.60 ఉండగా కొత్త ధర రూ.80, వంకాయ పాతది రూ. 40 ఉండగా కొత్త ధర రూ.70 చొప్పున ధరలు మండిపోతున్నాయి.

ఇవి కాకుండా బెండకాయ రూ.40, గోరుచిక్కుడు రూ.40, మునగకాయ రూ.80, సోరకాయ ఒక్కంటికి రూ.20లు, పాలకూర రూ.40లు, బీట్రూట్ రూ. 50లు, తోటకూర రూ.30, చుక్క కూర రూ. 40, అల్లం రూ.100, బీన్స్ రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు.- ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి జి ల్లాలోని మార్కెట్లకు ఇతర ప్రాంతాల నుంచి పలువురు హోల్సెల్ వ్యాపారులు కూరగాయలు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయి స్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలు కూరగాయలను ప్రతీ నిత్యం తీసుకువస్తున్నారు.

జిల్లాలోని పలు ప్రాం తాల్లో భూగర్భ జలాలు తగ్గడం, సాగు నీటి వసతి, ఇతర కారణాల వల్ల కూరగాయలను పండించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెం తి కూర తదితర ఆకుకూరలు బోరు మో టార్ల నుంచి నీరు అందక ఎండిపోతున్నాయని అంటున్నారు. దీంతో ఆకు కూరలు మార్కెట్ రాక ధరలు పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు. సామాన్యుడికి కోడి గుడ్డు భారంగా మారింది. గతంలో రూ.5-6 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ.8కి చేరింది. ఉత్పత్తి తగ్గడం, దాణా ధరలు పెరగడమే దీనికి కారణం. దీంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. మరో రెండు నెలల వరకు ధరలు తగ్గకపోవచ్చని నిపుణుల అంచనా.