20 June, 2026 | 2:48 AM

ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి

20-06-2026 01:31 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట , జూన్ 19 (విజయక్రాంతి):ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యంతో పాటు నాణ్యమైన మందులు, భోజనం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్యులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఇన్-పేషెంట్, అవుట్-పేషెంట్ వార్డులను స్వయంగా పరిశీలించి, రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఐదు నెలల్లో (జనవరి-మే) రికార్డు స్థాయిలో 1,12,000 మందికి పైగా ఓపీ, 25,000 మందికి పైగా ఐపీ రోగులకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మోకాలి మార్పిడి వంటి అత్యాధునిక ఆర్థోపెడిక్ సర్జరీలు విజయవంతంగా జరుగుతున్నాయని, గైనకాలజీ విభాగంలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే, ఆసుపత్రిలోని ప్రత్యేక యూనిట్ ద్వారా 58 మంది క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత కీమోథెరపీ, పేలియేటివ్ కేర్ అందిస్తున్నట్లు వివరించారు.నిర్మాణం పూర్తయిన నూతన మాతా శిశు సంరక్షణ బ్లాక్ను అవసరమైన ఎక్విప్మెంట్తో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ ప్రకటించారు. చివరి దశకు చేరిన జనరల్ హాస్పిటల్ నూతన ప్రధాన భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, ఆర్‌ఎంఓలు గీతా వాణి, ప్రశాంతి, మునిసిపల్ కమీషనర్ హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.