11-08-2025 01:40:53 AM
నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ప్రముఖనటులు ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండల విచారణ ఇంకా కొనసాగుతుండ గానే, తాజాగా స్టార్‌హీరో దగ్గుబాటి రానాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
గతకొద్ది రోజులుగా ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొందరు సినీ ప్రముఖులకు ఈ యాప్‌ల నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు అనుమానిస్తున్నారు. ఈ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన వారిని, ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఈడీ విచారణకు పిలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్, యువహీరో విజయ్ దేవరకొండను అధికారులు విచారించారు. వారి బ్యాంక్ ఖాతాల వివరాలు, యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్టు సమాచారం.
తాజాగా రానాకు నోటీసులు జారీ కావడంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 13న నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరుకానున్నారు. వరుసగా సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు అందుతుండటంతో టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేగింది.