calender_icon.png 11 August, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదకు పరిష్కారం

11-08-2025 01:37:46 AM

ముంపు నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

  1. అమీర్‌పేటలో ఆకస్మిక తనిఖీలు 
  2. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి
  3. రోడ్డు కంటే ఎత్తులో డ్రైనేజీ ఉండటంపై ఆగ్రహం 
  4. కుంటల కబ్జాపై స్థానికుల ఫిర్యాదు
  5. బుద్ధనగర్‌లో ప్రత్యేక ట్రంక్ లైన్‌కు ఆదేశం 
  6. చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్‌లోని  లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది.

మరోవైపు ఇంకా భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి అమీర్‌పేటలో ఆకస్మిక తని ఖీలు నిర్వహించారు. ఆదివారం నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. మైత్రీవనం సమీప కాలనీలోని గంగుబాయి బస్తీలో సీఎం పర్యటించారు.

బుద్ధనగర్‌లో డ్రైనే జీ వ్యవస్థను పరిశీలించారు. బస్తీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పలు కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, సమస్యకు తాత్కాలిక ఉపశమనం కాకుండా, శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గంటల వానకే జలమయం

శనివారం రాత్రి నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ వాన దెబ్బకు మీర్‌పేట, మిథిలానగర్‌లలో నడుము లోతు నీరు చేరగా, బాలాజీ నగర్, సత్యసాయి నగర్‌లలో రోడ్లు నదులను తలపించాయి. డ్రైనే జీలు పొంగిపొర్లడంతో మురుగు నీరంతా ఇళ్లలోకి చేరి, స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వరద వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

క్షేత్రస్థాయిలో సీఎం పర్యటన

ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రభావిత ప్రాంతాలైన బల్కంపేట, అమీర్‌పేటలోని బుద్ధనగర్, మైత్రీవ నం వద్ద ఆకస్మికంగా పర్యటించారు. వరద ప్రభావంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బుద్ధనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన ఆయన, అశాస్త్రీయ నిర్మాణాలపై అసహనం వ్యక్తం చేశా రు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కు వ ఎత్తులో ఉండటం, అది కూడా ఇరుకుగా మారడంతోనే వరద తీవ్రత పెరుగుతోందనిని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించి స్ట్రీమ్‌లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని ఆదేశించారు.

కుంట కబ్జా.. శాశ్వత పరిష్కారానికి ఆదేశం

పర్యటన సందర్భంగా, పక్కనే ఉన్న గం గూబాయి బస్తీ కుంటను కొందరు పూడ్చివేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించిన సీఎం.. కుంటల పరిరక్షణలో వైఫల్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాం తంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పా టు చేయాలని, దీనికి సంబంధించిన ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని అధికా రుల ను ఆదేశించారు. అనంతరం మైత్రీవనం వ ద్ద పరిస్థితిని పరిశీలించి, స్థానికులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

చిన్నారితో ముఖ్యమంత్రి సంభాషణ 

బుద్ధనగర్ పర్యటనలో ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆప్యాయంగా మాట్లాడారు. వరద నీటి సమస్య గురించి అడగ్గా, ఆ చిన్నారి తన కాలనీలో ఏటా ఎదురవుతున్న కష్టాలను, సమస్య తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించాడు. బాలుడి స్పందనకు సీఎం స్పందిస్తూ, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.